12 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగి

12 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగి

మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీ అయింది. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి దొంగను అరెస్టు చేశారు. అతని వద్దనుంచి రూ.9 కోట్లను రికవరీచేశారు.  కట్ చేస్తే.. దొంగ ఎవరో తెలుసా ? బ్యాంకు ఉద్యోగే. అతడి పేరు షేక్ అల్తాఫ్. ముంబ్రా నివాసి. బ్యాంకులో కొంతకాలం కస్టోడియన్ గా పనిచేశాడు. అతను బ్యాంకు లాకర్ల కీల కేర్ టేకర్ గా ఉన్నాడు. లాకర్లలో దాచిన డబ్బును కొట్టేసేందుకు ఏడాది నుంచి ప్లాన్ చేశాడు. పక్కా పథకం ప్రకారం జులై 12న బ్యాంకులో చోరీకి పాల్పడి అందినకాడికి దండుకుని పారిపోయాడు. ఇందుకు అతనికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారిని కూడా అరెస్ట్ చేశారు. 

ప్రధాన నిందితుడు అల్తాఫ్ ముందుగా బ్యాంకులోని అలారం సిస్టమ్ ను డియాక్టివేట్ చేసి..సీసీ టీవీని ధ్వంసం చేశాడు. తర్వాత ఖజానాను తెరిచి నగదును ఎత్తకెళ్లాడు. ఈ చోరీలో అల్తాఫ్ సోదరుడు నీలోఫర్ కూడా పాలు పంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచి చూసిన అధికారులు డబ్బు మాయమైనట్టు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. థానే,నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్  నిర్వహించి షేక్ అల్తాఫ్ ను అరెస్ట్ చేశారు.