సీఎం ఈవెంట్ లో చేతిలో పోస్టర్ తో వ్యక్తి హల్ చల్

 సీఎం ఈవెంట్ లో చేతిలో పోస్టర్ తో వ్యక్తి హల్ చల్

పాట్నాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భద్రతా లోపం బట్టబయలైంది. చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ వ్యక్తి చేతిలో ఓ పోస్టర్‌తో అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.

26 ఏళ్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి, బీహార్ మిలిటరీ పోలీస్ (BMP) సిబ్బంది అయిన అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం డ్యూటీలో మరణించినందున కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం డిమాండ్ చేస్తున్నాడు. తన డిమాండ్‌ను వివరించే పోస్టర్‌ను పట్టుకుని, అతను జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ముఖ్యమంత్రి సభలో ప్రసంగిస్తుండగా.. హై-సెక్యూరిటీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని వేదిక నుంచి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

ఆ వ్యక్తిని ముంగేర్ జిల్లాకు చెందిన దివంగత రాజేశ్వర్ పాశ్వాన్ కుమారుడు నితీష్ కుమార్ (26)గా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని భద్రతా అధికారులు విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణ చేయగా.. అతని తండ్రి బీఎంపీ సిబ్బందిగా పనిచేసి కొన్నేళ్ల క్రితమే మరణించాడని తేలిందని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ చెప్పారు. "తన తండ్రి డ్యూటీలో ఉన్నపుడే మరణించినందున కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అతను అర్హుడని తెలిపాడు. ఈ కారణంగా అతను సీఎంను కలవాలనుకున్నాడు. మేము విచారణకు ఆదేశించాము. తదుపరి విచారణ జరుగుతోంది" అని ఆయన వివరించారు.