- రూ. 75 వేల ఫైన్, రూ. 10 లక్షల పరిహారం
- నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు
నల్గొండ అర్బన్, వెలుగు: బాలికకు మాయమాటలు చెప్పి, బలవంతంగా పెండ్లి చేసుకోవడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు అయింది. విచారణ జరిపిన నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నిందితుడికి 32 ఏండ్ల జైలు, రూ. 75 వేల జరిమానా విధించడంతో పాటు బాలికకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని సంచలన తీర్పు వెలువరించింది. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ పట్టణ శివారులోని పానగల్‌కు చెందిన గురిజాల చందు 2022లో ఓ పదిహేనేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పెండ్లి చేసుకొని శారీరకంగా వాడుకొని కొన్ని రోజుల తర్వాత వదిలేశాడు.
దీంతో బాలిక కుటుంబ సభ్యులు నల్గొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చందుపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులు నమోదు అయ్యాయి. చందును అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు చందుకు జైలుశిక్ష, జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కేసులో సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
