ముగ్గురి ప్రాణం తీసిన స్కూల్‌ ఫీజు

ముగ్గురి ప్రాణం తీసిన స్కూల్‌ ఫీజు

చెన్నై: పోలీసు కావాలని కలలు కన్న ఓ చిన్నారి కుటుంబాన్ని.. మృత్యువు స్కూల్ ఫీజు రూపంలో కబలించింది. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన గోల్డ్ స్మిత్ సెంథిల్‌ కుమార్‌(35) తన పదకొండేళ్ల కొడుకును ప్రైవేటు స్కూళ్లో చదివించి ప్రయోజకుడ్ని చేయాలనుకున్నాడు. కానీ, స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితిలో మనస్తాపానికి గురై కుమారుడు, భార్యతో పాటు, సెంథిల్ కుమార్ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఓ ప్రైవేట్‌ స్కూళ్లో ఆరో తరగతి చదువుతున్న తన కుమారుడి ఫీజు కట్టేందుకు కొద్దిరోజులుగా అప్పుకోసం సెంథిల్‌ ప్రయత్నిస్తున్నాడు. అప్పు దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై భార్య, కొడుకుతో కలిసి అన్నంలో పురుగుల మందు కలుపుకుని తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతి చెందిన సమయంలో బాలుడు పోలీసు యూనిఫాం ధరించి ఉండడం గమనార్హం. పోలీసు దుస్తులంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమని బంధువులు కన్నీరుమున్నీరుగా రోధిస్తుండడం కంటతడి పెట్టించింది.