
సిద్దిపేట, వెలుగు : ‘మన ఊరు మనబడి’ వర్క్స్ స్పీడప్ చేయాలని సంబంధిత అధికారులను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నత్తనడకన కొనసాగుతున్న పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెజ్జంకి మండలంలో పనుల తీరు మెరుగుపడాలన్నారు. బడుల్లో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, ఇతర రిపేర్ల ను త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు పూర్తి చేశాకే ప్రహారీ, అదనపు తరగతి గదులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజూ స్కూళ్లలో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షించాలని సూచించారు. మళ్లీ రివ్యూ జరిగే నాటికి హుస్నాబాద్ నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి పనుల పరిశీలన
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను, మ్యాప్‌లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ ఏజెన్సీ టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీర్లతో కలెక్టర్ మాట్లాడారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తూ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వాహనాల పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం ఉండేలా చూడాలన్నారు. భవిష్యత్తు అవసరాల అనుగుణంగా వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్పెషల్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పారు. ఆసుపత్రి ఆవరణలో మార్చూరీ, పారామెడికల్, అటెండర్ షెడ్ నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల్లో ప్లాన్ రెడీ చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రి ఓఎస్డీ బాల్ రాజ్, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.
స్కూళ్లలో మెదక్ డీఈవో ఆకస్మిక తనిఖీ
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా హవేలీఘనపూర్, మద్దుల్వాయి పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కింద చేపడుతున్న పనులను డీఈవో రమేశ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, పాఠాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. మనఊరు మనబడి పనులపై టీచర్లకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి సుభాష్ నాయక్, ఎంఈవో నీలకంఠం, స్కూళ్ల హెడ్మాస్టర్లు ఓంకార్, కుమార్, ధనుంజయ చారి, సంతోశ్ కుమారి ఉన్నారు.