వారంలో బడులు ప్రారంభం.. ప‌‌నులేమో సగం సగం

వారంలో బడులు ప్రారంభం.. ప‌‌నులేమో సగం సగం
  • నత్తనడకన ‘మ‌‌న ఊరు–మ‌‌న బ‌‌డి’ వర్క్స్​
  • 10లోగా కంప్లీట్ చేయాల‌‌ని ఆఫీసర్ల ఆర్డర్​
  • కాంట్రాక్టర్ల అలసత్వం  ఇప్పటి వ‌‌ర‌‌కు30 శాత‌‌మే ప‌‌నులు పూర్తి

ఖ‌‌మ్మం, వెలుగు: ‘మ‌‌న ఊరు– మ‌‌న బ‌‌డి’ ప‌‌నులు ఒక అడుగు ముందుకు ప‌‌ది అడుగులు వెన‌‌క్కి అన్నట్లు సాగుతున్నాయి. 14నెల‌‌ల కింద ప‌‌నులు ప్రారంభించారు. మ‌‌రో ప‌‌ది రోజుల్లో కొత్త విద్యా సంవ‌‌త్సరం ప్రారంభం కానుంది. ఇప్పటి వ‌‌ర‌‌కు ప‌‌నులు పూర్తి కాలేదు. మొద‌‌టి విడ‌‌త‌‌లో చేప‌‌ట్టిన ప‌‌నుల్లోనే 30శాతం మాత్రమే కంప్లీట్అయ్యాయి. మ‌‌రో వారం రోజుల్లో ప‌‌నుల‌‌న్నీ పూర్తి చేయాల‌‌ని కాంట్రాక్టర్లకు ఆఫీసర్లు టార్గెట్ పెడుతున్నా, అనుకున్నంత వేగంగా ప‌‌నులు సాగ‌‌డం లేదు. మ‌‌రోవైపు జిల్లాలో న‌‌త్తనడ‌‌క‌‌న ప‌‌నులు సాగుతున్నాయ‌‌ని విమ‌‌ర్శలు వ‌‌స్తుంటే, ఆఫీసర్లు మాత్రం రాష్ట్రంలో ‘మ‌‌న ఊరు– మ‌‌న బ‌‌డి’ ప‌‌నుల్లో ఖ‌‌మ్మం జిల్లా మొద‌‌టి స్థానంలో ఉంద‌‌ని గ‌‌ర్వంగా చెబుతున్నారు. మిగిలిన జిల్లాల కంటే మెరుగ్గా ప‌‌నిచేస్తున్నామ‌‌ని చెప్పుకుంటూ త‌‌మ ఆల‌‌స్యాన్ని క‌‌వ‌‌ర్ చేస్తున్నారు. అయితే విద్యార్థుల త‌‌ల్లిదండ్రులు మాత్రం స్కూల్స్ ప్రారంభ‌‌మ‌‌య్యేలోగా ప‌‌నులు కంప్లీట్అయితే బాగుంటుంద‌‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

బిల్లులు రాలేదన్న కారణంతో...

జిల్లాలో 426 స్కూల్స్​ల్లో మొద‌‌టి విడ‌‌తగా ప‌‌నులు చేప‌‌ట్టారు. వీటిలో ఇప్పటి వర‌‌కు కేవ‌‌లం 73 స్కూళ్లల్లో మాత్రమే ప‌‌నులు కంప్లీట్ అయ్యాయి. మిగిలిన స్కూళ్లల్లో 2396 ప‌‌నులు చేప‌‌ట్టి, 1268 ప‌‌నులు పూర్తి చేశారు. వీటికి రూ.76.3 కోట్లు మంజూరు కాగా, రూ.35.53 కోట్ల ప‌‌నుల‌‌కు ఎంబీ చేయించారు. ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభించే స‌‌మ‌‌యానికి వంద శాతం ప‌‌నులు కంప్లీట్ చేయాల్సి ఉంది. కాగా మిగిలిన 353 స్కూళ్లల్లో వివిధ స్టేజీల్లో ప‌‌నులు సాగుతున్నాయి. 31 స్కూళ్లల్లో 90 శాతం కంటే ఎక్కువ‌‌, 185 స్కూళ్లల్లో50 శాతం కంటే ఎక్కువ‌‌గా, 106 స్కూళ్లల్లో50 శాతం కంటే త‌‌క్కువ‌‌గా ప‌‌నులు పూర్తయ్యాయి. రూ.30 ల‌‌క్షల్లోపు ప‌‌నుల‌‌ను ఎస్​ఎంసీల ద్వారా పూర్తిచేయాలి. అంత‌‌కంటే బ‌‌డ్జెట్ ఎక్కువ ఉన్న ప‌‌నుల‌‌ను కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు ప‌‌నులు చేస్తున్న చోట స‌‌కాలంలో బిల్లులు రావ‌‌డం లేద‌‌న్న కార‌‌ణంతో ప‌‌నులు పెండింగ్ పెడుతున్నారు. దీంతో ఆఫీస‌‌ర్లు కూడా వారిపై ఒత్తిడి తేలేని ప‌‌రిస్థితిలో ఉన్నారు. 

కొందరికి నోటీసులు...

స్కూళ్లల్లో ప్రహరీలు, వంట షెడ్‌‌, మ‌‌రుగుదొడ్ల నిర్మాణం, క‌‌రెంట్, అద‌‌న‌‌పు త‌‌ర‌‌గ‌‌తి గ‌‌దులు, లేటెస్ట్ బెంచీలు వంటి ప‌‌నులు చేస్తున్నారు. ప‌‌నులు చేయ‌‌కుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను దారికి తెచ్చేందుకు వారికి నోటీసులు ఇవ్వాల‌‌ని భావిస్తున్నారు. క‌‌లెక్టర్ ద్వారా ముందుగా 15 మంది కాంట్రాక్టర్లకు నోటీసులు పంపించాల‌‌ని ప్లాన్ చేస్తున్నారు. 

కొన్ని మండ‌‌లాల్లో ఇదీ ప‌‌రిస్థితి..

  • కూసుమంచి మండ‌‌లంలో రూ.6 కోట్లతో 23 స్కూళ్లల్లో ప‌‌నులు మంజూరు కాగా, ఇప్పటి వ‌‌ర‌‌కు కేవలం మూడు స్కూళ్లల్లోనే పూర్తయ్యాయి. మిగిలినవాటిల్లో ప‌‌నులు పెండింగ్ ఉన్నాయి. ప‌‌నులు చేస్తున్న స‌‌ర్పంచ్ లు చేసిన ప‌‌నుల‌‌కు బిల్లులు ఇస్తే, మిగిలిన ప‌‌నులు చేస్తామ‌‌ని అంటుండ‌‌గా ఆఫీస‌‌ర్లు మాత్రం ప‌‌నులు పూర్తి చేసి బిల్లులు తీసుకోవాల‌‌ని చెబుతున్నారు. 
  •  వైరా మున్సిపాలిటీలోని గ‌‌వ‌‌ర్నమెంట్ హైస్కూల్ కు రూ.54 ల‌‌క్షల ఎస్టిమేష‌‌న్ వేయ‌‌గా, ప్రస్తుతం 70 శాతం ప‌‌నులు పూర్తయ్యాయి. బిల్లులు రాక‌‌ గేటు నిర్మాణం చేయ‌‌కుండానే వ‌‌దిలేశాడు. 
  • కారేపల్లి మండలంలోని చీమలపాడు, బాజు మల్లాయగూడెం యూపీఎస్ లు రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ స్కూళ్లకు నిధులు మంజూరయ్యాయి. వీటిల్లో కరంట్​గాడీలు కొట్టి పైపులు వేసి వదిలేశారు. వాటిలో వైర్లు కూడా లాగలేదు. మిగతా ఏ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.