
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులోని గోదావరి నది తీరంలో, మాతా శిశు ఆస్పత్రి, రామ్ నగర్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని డీసీపీ ఎ.భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్, ఎసీపీ ప్రకాశ్, తహసీల్దార్ రఫతుల్లాతో కలిసి శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 8 లక్షల క్యూసెక్కుల వరద చేరిందని తెలిపారు.
నదీ తీర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మాతా శిశు కేంద్రం నుంచి గర్భిణిలు, బాలింతలు, పిల్లలను ఇతర ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది సమీప ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ లోని కంట్రోల్ రూం 08736- 250501 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించా లని సూచించారు. కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రెవెన్యూ, పోలీసు, రవాణా, రోడ్లు- భవనాలు శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. రోడ్లపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాలను(బ్లాక్ స్పాట్) గుర్తించి వాహనదారులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపినా, రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో శ్రీనివాస్ రావు, ఏసీపీలు ప్రకాశ్, రవికుమార్, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.