పోష్ చట్టంపై అవగాహన అవసరం : కలెక్టర్ కుమార్ దీపక్

పోష్ చట్టంపై అవగాహన అవసరం : కలెక్టర్ కుమార్ దీపక్
  • జిల్లాలో 47 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు
  • కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, వెలుగు: ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్ మెంట్(పోష్)- 2013 చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డీఎంహెచ్​వో అనిత కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులకు పోష్ చట్టంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నివారణ, పరిష్కారాల గురించి తెలుసుకోవాలన్నారు. 

జిల్లాలో స్థానిక, అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. మహిళలు తాము పని చేసే ప్రదేశాల్లో ఇబ్బందులకు గురైతే ఈ కమిటీలను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 47 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు కొనసాగుతున్నాయని, లైంగిక వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మహిళల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన హెల్ప్​లైన్ టోల్ ప్రీ నంబర్ 181ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చట్టానికి సంబంధించిన వాల్​పోస్టర్లును ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, స్థానిక, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ప్రతినిధులు కవిత, శివకీర్తి,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.