నస్పూర్, వెలుగు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ ఎ. భాస్కర్, అడిషనల్ కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి సబ్ -కలెక్టర్ మనోజ్ తో కలిసి అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ, ఎస్టీ లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదైతే వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
కమిటీ సభ్యులు దమ్మ నారాయణ, చిలుక రాజనర్సు, బెక్కం రాజారావు, దుర్గం ఎల్లయ్య, పెద్ది రాజన్న పాల్గొన్నారు. అంతకుముందు పాత మంచిర్యాలలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ పనులను పరిశీలించారు. పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. కాసిపేట మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి అదనపు తరగతి గదులు, భోజనశాల పనులను పరిశీలించారు.
