టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్
  • హెచ్ఎంలతో సమావేశంలో కలెక్టర్

నస్పూర్, వెలుగు: వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా టెన్త్​స్టూడెంట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో డీఈవో ఎస్.యాదయ్యతో కలిసి హైస్కూళ్ల హెచ్​ఎంలతో 10వ తరగతి వార్షిక పరీక్షలపై రివ్యూ నిర్వహించారు.

 వార్షిక పరీక్షకు సిద్ధమవుతున్న ప్రతి టెన్త్​విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల సాధించేలా బాధ్యత తీసుకోవాలని హెచ్ఎంలను ఆదేశించారు. ప్రతి విద్యార్థి క్రమంతప్పకుండా స్కూల్​కు వచ్చేలా పర్యవేక్షించాలని, తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ స్టూడెంట్ల పురోగతికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులో సిలబస్ పూర్తి చేయాలన్నారు.

ట్రైనింగ్​లో నేర్చుకున్న అంశాలను స్కూళ్లలో అమలు చేయాలి

జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన కేజీబీవీ స్కూళ్ల ప్రత్యేక అధికారులు, ఆదర్శ స్కూళ్ల బాలికల సంక్షేమ వసతి గృహాల వార్డెన్ లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డీఈవోతో కలిసి హాజరయ్యారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారికి భద్రత, భరోసా కల్పించాలన్నారు. 

శిక్షణలో నేర్చుకున్న అంశాలను స్కూళ్లలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీజీఈ మల్లేశం, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు భరత్, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా సమన్వయకర్త నవీన జ్యోతి, సహాయ సమన్వయకర్త రమాదేవి,  అధికారులు పాల్గొన్నారు.

ఆస్పత్రి పరిశీలన

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేటలోని 30 పడకల ఆస్పత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనులను కలెక్టర్​పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులు స్పీడప్ చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని అవుట్ పేషంట్, ల్యాబ్, వార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రులను ఆధునికరిస్తూ సాంకేతిక పరికరాలను సమకూరుస్తోందని తెలిపారు.