- జిల్లా ఉద్యానవన అధికారి అనిత
బెల్లంపల్లి రూరల్, వెలుగు: జిల్లాలో రైతులు పండించిన మామిడి పండ్లను ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేసి అధిక లాభాలు పొందాలని మంచిర్యాల జిల్లా ఉద్యానవన అధికారి అనిత సూచించారు. అగ్రికల్చర్ అండ్ ప్రోసెస్సెడ్ ఫుడ్ ప్రొడక్స్ఎక్స్ఫర్ట్ డెవలప్మెంట్అథారిటీ(అపేడా)కు చెందిన హైదరాబాద్ ప్రతినిధి అబ్దుల్ ఖాదర్తో కలిసి సోమవారం చిత్తాపూర్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. మామిడి సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన మామిడి పండ్లను ఎగుమతి చేస్తే అధిక ధరలు పొందవచ్చన్నారు.
నాణ్యమైన దిగుబడి, ఎగుమతులకు పూర్తి సహాయ సహకారాన్ని ప్రభుత్వం అందించనుందన్నారు. విదేశాలకు ఎగుమతి చేయాలనుకునే రైతులు అపేడా వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మామిడి పండించే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సృజన, హెచ్వో అరుణ్, నెన్నెల, బెల్లంపల్లి, చెన్నూర్హెచ్ఈవోలు కుమార్, అర్చన, కల్యాణి పాల్గొన్నారు.
