మెడికల్​ కాలేజీకి కొలిక్కిరాని భూ సేకరణ

మెడికల్​ కాలేజీకి కొలిక్కిరాని భూ సేకరణ
  • రెండేండ్లవుతున్న ఇంకా పరిశీలన దశలోనే 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ భవన నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. అనుమతులు వచ్చి రెండేండ్లు అవుతున్నా స్థల సేకరణ కొలిక్కి రావడం లేదు. దీంతో  మార్కెట్​ యార్డు గోదాముల్లో కాలేజీ నడుస్తోంది. ఎంసీఐ రూల్స్​ ప్రకారం కాలేజీ ప్రారంభించిన ఏడాదిలోగా పక్కా భవనాలు నిర్మించాలి. లేకుంటే పర్మిషన్​ క్యాన్సల్​ అవుతుందని స్పష్టం చేసినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు అనువైన ప్రభుత్వ భూముల కోసం వెతుకుతున్నారు. ఫైనల్​గా గుడిపేటలోని ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చారు. ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే రియల్​ బిజినెస్​కు అనుకూలంగా ఉన్న స్థలాలను కేటాయించాలని రియల్టర్లు లాబీయింగ్​ చేయడం వల్ల ఎటూ తేల్చలేకపోతున్నట్టు తెలుస్తోంది.

పరిశీలనలు– తిరష్కరణలు

మెడికల్​ కాలేజీ కోసం మొదట గోదావరి పక్కనున్న 207, 208 సర్వేనంబర్లలోని భూదాన్​ బోర్డు భూముల్లో 22 ఎకరాలను కేటాయించారు. ఇక్కడే నర్సింగ్​ కాలేజీ నిర్మాణానికి నిరుడు మార్చి 5న హెల్త్​ మినిస్టర్​ హరీశ్​ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అక్కడ రూ.18 కోట్లతో మదర్​ అండ్​ చైల్డ్​ హాస్పిటల్​ (ఎంసీహెచ్​) నిర్మించారు. జూలైలో వచ్చిన వరదల్లో అది  నీటమునిగింది. ఫస్ట్​ ఫ్లోర్​ వరకు నీళ్లు వచ్చాయి. భవిష్యత్​లోనూ ముంపు పొంచి ఉండడంతో ఎంసీహెచ్​ను వేరే చోటికి తరలించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో  అధికారులు మరో మూడు చోట్ల ప్రతిపాదనలు చేశారు. నస్పూర్​లోని 669 సర్వేనంబర్​లో సింగరేణికి చెందిన 45 ఎకరాలను పరిశీలించారు. దానికి దగ్గరలో ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​ (ఓసీపీ) ఉండడంతో మెడికల్​ బోర్డ్​ తిరస్కరించింది. అంతకుముందు ఇందారం శివారులో అనుకున్నప్పటికీ జిల్లా కేంద్రానికి దూరమవుతుందని విరమించుకున్నారు. తర్వాత మంచిర్యాలలోని సాయికుంట శివారులో 662, 672 సర్వేనంబర్లలోని 14 ఎకరాలను ప్రతిపాదించారు. ఈ స్థలాన్ని మెడికల్​ కాలేజీకి కేటాయిస్తూ మున్సిపల్​ కౌన్సిల్​లో తీర్మానం చేశారు. ఇది కూడా ముంపు ప్రాంతం, లూజ్​ సాయిల్​ కావడం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వంటి కారణాల చూపుతూ మెడికల్​ బోర్డ్​ నో చెప్పింది.  

గుడిపేటలో అనుకూలమైనా...  

తాజాగా గుడిపేటలోని 13వ పోలీస్​ బెటాలియన్​ సమీపంలోని 294, 300 సర్వేనంబర్లలోని 40 ఎకరాల గవర్నమెంట్​ ల్యాండ్​ను మెడికల్​ కాలేజీకి ప్రతిపాదించారు. మూడ్రోజుల కిందట మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రిజ్వి, డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ (డీఎంఈ) రమేశ్​ ​రెడ్డి, తెలంగాణ స్టేట్​ మెడికల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (టీఎస్​ఎంఎస్​ఐడీసీ) మేనేజింగ్​ డైరెక్టర్​ చంద్రశేఖర్​రెడ్డి ఈ స్థలాన్ని పరిశీలించారు. మెడికల్​ కాలేజీకి 25 ఎకరాలు అవసరం కాగా, ఇక్కడ 40 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. భవిష్యత్​లో మెడికల్​ కాలేజీ విస్తరణకు మిగులు భూమి  ఉంటుందనే అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందనే కారణంతో హోల్డ్​లో పెట్టినట్టు సమాచారం. 5 కిలోమీటర్ల పరిధిలో మరో స్థలాన్ని గుర్తించాలని జిల్లా అధికారులకు సూచించినట్టు తెలిసింది. కానీ ఆ పరిధిలో ఒకే చోట 25 ఎకరాల భూమి అందుబాటులో లేదు. ఉన్న భూములన్నీ కబ్జాలపాలు కావడంతో మెడికల్​ కాలేజీకి స్థలం దొరకని పరిస్థితి ఎదురైంది.  

రియల్టర్ల లాబీయింగ్... 

సాయికుంట శివారులో పలువురు రూలింగ్​ పార్టీ లీడర్లు,  రియల్టర్లకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. గోదావరి వరద ముంపు ప్రాంతం కావడంతో అక్కడ భూమి రేటు తక్కువ ఉంది.  ఈ ప్రాంతంలో మెడికల్​ కాలేజీ కడితే తమ భూములకు డిమాండ్​ వస్తుందని, రేట్లు రెండింతలు పెరుగుతాయని, తద్వారా కోట్లలో లాభపడవచ్చని భావించారు. ప్రజాప్రతినిధులను  ఒప్పించి సాయికుంట శివారులోని 14 ఎకరాల మున్సిపల్​ స్థలాన్ని కేటాయించేలా పావులు కదిపారు. ఈ స్థలాన్ని మెడికల్​ కాలేజీకి కేటాయిస్తూ ఆగమేఘాల మీద మున్సిపల్​ కౌన్సిల్​లో తీర్మానం చేశారు. కానీ దీనికి మెడికల్​ బోర్డ్​ నో చెప్పింది.  గుడిపేటలోని భూమి  జిల్లా కేంద్రానికి దూరమవుతుందనే కారణంతో మళ్లీ వేరే స్థలాన్ని సేకరించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో  మళ్లీ అదే సాయికుంటలోని మున్సిపల్​ స్థలాన్ని కేటాయించేలా పెద్ద ఎత్తున లాబీయింగ్​ చేస్తున్నట్టు సమాచారం.