భార్య, బిడ్డ పుట్టింటికి వెళ్లడానికి కారకుడంటూ హత్య
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మంద మర్రి మండలం సండ్రోనిపల్లి గ్రామానికి చెందిన మెండ్రపు గోపాల్ను రోకలిబండతో తలపై కొట్టి చంపిన అతడి తమ్ముడు కుమార్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వారు వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకునే అన్నదమ్ములైన గోపాల్, కుమార్ కుటుంబాలు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.
వీరిద్దరూ తరచూ మద్యం సేవించి గొడవపడేవారు. అయితే అన్న గోపాల్, వదిన గంగ వేధింపుల కారణంగానే తన భార్య చంద్రకళ ఏడాది క్రితం తమ కుమార్తెతో సహా పుట్టింటికి వెళ్లిపోయిందని, తన భార్య వెళ్లిపోవడానికి అన్న గోపాలే కారణమని కుమార్ కక్ష పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మరోసారి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కుమార్కోపంతో గోపాల్ను రోకలిబండతో కొట్టి చంపాడు. నిందితుడు పరారీలో ఉండగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
