
- జీజీహెచ్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కు పేషంట్ల తరలింపు
- గోదావరి ఉప్పొంగడంతో ఎగతన్నిన రాళ్లవాగు
- పలు కాలనీలను చుట్టుముట్టిన వరద
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గోదావరి ఒడ్డున ఉన్న ఎంసీహెచ్ ను గురువారం మరోసారి ఖాళీ చేశారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో 40 గేట్లు ఓపెన్ చేసి 8.20 లక్షల క్యూసెక్కులను రిలీజ్ చేశారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఒక్కసారిగా గోదావరి నది ఉప్పొంగింది. గౌతమేశ్వర ఆలయం పక్క నుంచి వరద నీరు ఎంసీహెచ్ దగ్గర దాకా చేరింది. దీంతో ఏ క్షణమైనా మునిగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు హడావుడిగా ఎంసీహెచ్ ను ఖాళీ చేశారు. అందులో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులు మొత్తం 120 మంది పేషంట్లను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.
అక్కడ కూడా బెడ్స్ చాలకపోవడంతో దాదాపు 50 మందిని జిల్లా కేంద్రంలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, 104, 108 అంబులెన్సుల్లో విలువైన మెషీన్లు, స్కానింగ్, ఎక్స్‌రే పరికరాలు, మందులను జీజీహెచ్ కు తరలించారు. దీంతో ఎంసీహెచ్ పూర్తిగా ఖాళీ అయ్యింది. 2022 జూలైలో గోదావరికి భారీగా వరదలు వచ్చి ఎంసీహెచ్‌ను ముంచెత్తాయి. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు అంతకుముందే దానిని ఖాళీ చేసి పేషంట్లను జీజీహెచ్‌కు తరలించారు.
కాలనీల్లోకి వరద..
గోదావరి ఉప్పొంగడంతో రాళ్లవాగు ఎగతన్ని మంచిర్యాల ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. పలువురు ఇళ్లలోని సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు ప్రజలను అలర్ట్ చేసి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం వరకు గోదావరి వరద కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే మళ్లీ వరద ముంచెత్తే ప్రమాదం ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు: కలెక్టర్
గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఉదయం ఆయన గోదావరి ఒడ్డునగల గౌతమేశ్వరాలయం, ఎంసీహెచ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత కాలనీలను సందర్శించారు. వరదలు వస్తే ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు.