జన్నారం, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, తగిన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అదేశించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్లి భోజనాన్ని, నిత్యావసర వస్తువులు, హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మండలంలోని కిష్టాపూర్ లో ఉన్న కస్తూర్బా స్కూల్‌ను సందర్శించి బాలికలతో మాట్లాడారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాస్ ఉన్నారు.
