
నేరడిగొండ, వెలుగు: గిరిజనుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ఫలాలను అర్హులైన వారికి అందించేలా చూడాలని మండల నోడల్ ఆఫీసర్, ఎంపీడీవో శేఖర్ సూచించారు. ఆది కర్మయోగి అభియాన్ జన జాతీయ గ్రామ ఉత్కృష్ట అభియాన్ లో భాగంగా నేరడిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్ని విభాగాల ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల గిరిజనుల ఆచారాలు, జీవనశైలి విభిన్నంగా ఉంటుందని, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.
మండలంలోని 12 గ్రామపంచాయతీ గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, జీవిత బీమా, ఆది సురక్ష బీమా వంటి తదితర పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్య, అటవీ శాఖ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, మిషన్ భగీరథ, ఐకేపీ ఆఫీసర్లు పాల్గొన్నారు.