అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలి : జీఎం రాధాకృష్ణ

అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలి : జీఎం రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: ప్రతీ ఒక్కరు తాము నిజాయితీగా ఉంటూ అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ  సూచించారు. సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​ కాన్ఫరెన్స్​హాల్​లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఉద్యోగులందరినీ చైతన్యపరిచి అవినీతి నిర్మూలనలో భాగస్వాములను చేయడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సింగరేణి సంస్థలో ఏవైనా అక్రమాలు, అవినీతి జరుగుతున్నట్లు తెలిస్తే విజిలెన్స్​ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు. 

ఈ అంశంపై సింగరేణి అధికారులు, ఉద్యోగులు,  సింగరేణి స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజిలెన్స్ సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు. బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లు, ఆఫీసులు, రామకృష్ణాపూర్ సింగరేణి సూపర్​బజార్​లో వారోత్సవాలను నిర్వహించారు. ఎస్​వోటూ జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సింగరేణి ఆఫీసర్స్​అసోసియేషన్ జాయింట్​సెక్రెటరీ రవి, పీవో సత్యనారాయణ, గుర్తింపు సంఘం లీడర్లు పాల్గొన్నారు.