ఇక నుంచి 3 రోజుల్లోనే కంపెనీల లిస్టింగ్‌‌

ఇక నుంచి 3 రోజుల్లోనే  కంపెనీల లిస్టింగ్‌‌
  • డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి చేసిన సెబీ
  • తొందరగా అన్‌‌బ్లాక్ కానున్న ఇన్వెస్టర్ల ఫండ్స్‌‌

న్యూఢిల్లీ :  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌ (ఐపీఓ) కి వచ్చే కంపెనీలు ఇష్యూ పూర్తయిన తర్వాత మూడు వర్కింగ్ డేస్‌‌లోనే  మార్కెట్‌‌లో లిస్టింగ్ కావాలి.  గతంలో ఉన్న  ఆరు రోజుల టైమ్‌‌ పీరియడ్‌‌ను మూడు రోజులకు సెబీ తగ్గించింది.ఈ ఏడాది జూన్‌‌లో ఈ కొత్త రూల్‌‌ ప్రకటించగా, డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి చేశారు.  మొదట సెప్టెంబర్ 1 నుంచి  టీ+3 రూల్‌‌ను ఆప్షనల్‌‌ చేశారు. టీ+3 అంటే ఇష్యూ పూర్తయిన తర్వాత మూడు వర్కింగ్ డేస్ అని అర్థం. ఈ రూల్‌‌తో కంపెనీలకు, ఇన్వెస్టర్లకు మేలు జరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కంపెనీలు వేగంగా మార్కెట్‌‌లో లిస్ట్ అవుతాయని, షేర్లు అలాట్ కాని ఇన్వెస్టర్లకు రిఫండ్స్ తొందరగా జరుగుతాయని వెల్లడించారు.  వరుస పెట్టి ఐపీఓలు వస్తున్నాయని, ఇన్వెస్టర్లు ఒకేసారి అన్నింటిలో ఇన్వెస్ట్ చేయలేరని పాంటోమత్‌‌ క్యాపిటల్ అడ్వైజర్స్‌‌ ఎండీ మహావీర్‌‌‌‌ లునావత్‌‌ పేర్కొన్నారు.

లిస్టింగ్ టైమ్‌‌ పీరియడ్‌‌ను తగ్గించడంతో ఇన్వెస్టర్లు బెటర్‌‌‌‌గా ప్లాన్ చేసుకుంటారని అన్నారు. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్‌‌లు దూసుకుపోతున్న ప్రస్తుత టైమ్‌‌లో ఇన్వెస్టర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. లిస్టింగ్ టైమ్ పీరియడ్  తక్కువ ఉంటే ఇన్వెస్టర్ల మనీ ఎక్కువ కాలం బ్లాక్ అయి ఉండదని ఆనంద్‌‌ రాఠీ ఎనలిస్ట్‌‌ నరేంద్ర సోలంకి అన్నారు. ఫలితంగా ఫండ్స్‌‌ను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుంటుందని చెప్పారు. మరోవైపు ఈ కొత్త రూల్‌‌ వలన హై నెట్‌‌వర్త్‌‌ ఇండివిడ్యువల్స్‌‌, నాన్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా లాభపడనున్నారు.  సాధారణంగా వీరు అప్పు తీసుకొని ఐపీఓల్లో పెడతారని, తక్కువ టైమ్‌‌ ఈ ఫండ్స్ బ్లాక్ అయి ఉంటే వడ్డీ భారం అంత తక్కువ పడుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. టీ+3 రూల్‌‌ను ఫాలో అయిన మొదటి కంపెనీ రత్నవీర్‌‌‌‌ ప్రెసిషన్ ఇంజినీరింగ్. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 11 న లిస్ట్ అయ్యాయి. సెప్టెంబర్‌‌‌‌ 4–6 మధ్య కంపెనీ ఐపీఓ ఓపెన్‌‌లో ఉంది.