
న్యూఢిల్లీ: కొద్ది నెలల సైలెన్స్ తర్వాత కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రధాని మోడీ నీచుడు అంటూ గతంలో చేసిన వివాదాస్పద కామెంట్లను సమర్థించుకున్నారు. దేశం ఇంతవరకు మోడీ అంతటి నోటి దురుసు ప్రధానిని చూడలేదని అన్నారు. రైజింగ్ కాశ్మీర్, ద ప్రింట్ వెబ్‌సైట్‌లో తాజాగా ఈ మేరకు ఆర్టికల్ రాశారు. ‘‘2017 డిసెంబర్ 7న నేనెమన్నానో గుర్తుందా? అది నిజం కాదా?. మే 23న మోడీని ప్రజలు గద్దెదించబోతున్నారు. ఈ దేశం ఇంతదాకా ఎప్పుడూ చూడని నోటి దురుసు ప్రధానికి అదే తగిన శాస్తి’’ అని అందులో అన్నారు. మోడీని నీచుడని అన్నందుకు కాంగ్రెస్ ఆయన్ను 2017 పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏడాది తర్వాత దాన్ని ఎత్తేసింది.
ఇప్పుడు మళ్లీ తన కామెంట్లను సమర్థించుకోవడంపై బీజేపీ మండిపడింది. ‘బూతుల చీఫ్’ మళ్లీ వచ్చాడంటూ ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు ట్విటర్‌లో దుయ్యబట్టారు. తన ఆర్టికల్‌లో అయ్యర్ నెహ్రూకు, మోడీకి మధ్య పోలికల గురించి రాశారు. ‘‘నెహ్రూ కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి నేచురల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. సైంటిఫిక్ భావనలతో భారత్‌లో మూడనమ్మకాలను పారదోలాలని భావించారు. కానీ గణేశుడికి ఏనుగు తలను పెట్టి పురాణాల కాలంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశారని, ఇప్పటి ఎఫ్–16 లాంటి ఫైటర్లు అప్పట్లోనే ఉన్నాయని ఈ మోడీ చెబుతున్నారు. తన డిగ్రీల గురించి అబద్ధాలు చెప్పే మోడీకి, నెహ్రూకి ఎంత తేడా? మేఘాలు ఉన్నందున మన ఫైటర్ జెట్లను పాక్ రాడార్లు గుర్తుపట్టవని అన్నట్టు ఇటీవల ఆయనే చెప్పుకున్నారు. ఇలాంటి అశాస్త్రీయమైన, తెలివి తక్కువ మాటలు చెప్పడానికి సీనియర్ మోస్ట్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్లను మోడీ ఫూల్స్ అనుకున్నారా’’ అని అన్నారు.