రాజీనామా లేఖను తనకు తానే చింపేసుకున్న సీఎం

రాజీనామా లేఖను తనకు తానే చింపేసుకున్న సీఎం

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బైరెన్ సింగ్ తన  రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.  బైరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరుతూ ఆయన  ఇంటి ముందుకు వేలాది సంఖ్యలో ప్రజలు, మహిళలు తరలివచ్చారు. రాజీనామా చేయొద్దని నినాదాలు చేశారు. గవర్నర్ నివాసానికి వెళ్లే మార్గాన్ని దిగ్భంధించారు. ప్రజలు, మహిళల అభిష్టం మేరకు సీఎం పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని బైరెన్ సింగ్ ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా రాజీనామా లేఖను చింపేశారు. దీంతో ప్రజలు, మహిళలు సంబరాలు చేసుకున్నారు. 

నైతిక బాధ్యతతో..

మణిపూర్లో గత రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సీఎం బైరెన్ సింగ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 60 రోజులు గడుస్తున్నా..అక్కడ అల్లర్లను  అదుపు చేయలేకపోయారని బైరెన్ సింగ్ పై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ..జూన్ 30వ తేదీ బైరెన్ సింగ్ గవర్నర్ అనసూయ ఉకియా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసను అణచివేయడంలో విఫలం అయినందున నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు జూన్ 30వ తేదీ శుక్రవారం  నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని  రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను కోరారు. 

అల్లర్లు..100 మంది మృతి

మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చడం గురించి పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కుకీ తదితర తెగలవారు మే నెల నుంచి హింసాత్మక నిరసనలకు దిగారు. రెండు నెలలుగా మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. జూన్ 29వ తేదీ కూడా మరోసారి హింస ప్రజ్వరిల్లింది. భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.  ఐదుగురు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. దీంతో మణిపూర్ అల్లర్లలో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. 

అల్లర్లపై ఆల్ పార్టీ మీటింగ్..

మరోవైపు మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఆల్‌ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి శరద్ పవార్ హాజరు కాలేదు. అయితే ఎన్సీపీ తరపున జనరల్ సెక్రటరీ నరేంద్ర వర్మ, మణిపూర్ ఎన్‌సీపీ చీఫ్ సోరన్ ఇబోయమా సింగ్‌ హాజరయ్యారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఆప్‌ లీడ్ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.