
మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో మణిపూర్ ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది.
కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. పలు జిల్లాల్లో నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది.
మణిపూర్‌లో హింస చెలరేగడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని ఇండో మియన్మార్ సరిహద్దులో వైమానిక నిఘాను ప్రారంభించనున్నాయి. భౌతిక దాడులు జరగకుండా ప్రాంతాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాలను ఉపయోగించనున్నారు.
తిరుగుబాటు గ్రూపుల నుంచి సరిహద్దు వెంబడి శిబిరాల్లో నివాసముంటున్న ప్రజల భద్రతాను పర్యవేక్షించడానికి ఈ నిఘా ఉపయోగడపడుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఇది రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించేవరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో హింసను నియంత్రించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. అసోం రైఫిల్స్‌ను కూడా పలు ప్రాంతాల్లో మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కన్పిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఇంఫాల్‌తో సహా పలు ప్రాంతాలో కర్ఫ్యూ విధించారు. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 8 వేల మందిని మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతై వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు.
మణిపూర్‌లో నీట్ పరీక్ష వాయిదా..
మరోవైపు.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ మే7వ తేదీన నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యా, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.