మణిపూర్లో ఆ రోజు.. ఇంకో దారుణం ... 40 కి. మీ దూరంలో...అమానవీయ ఘటన

మణిపూర్లో ఆ రోజు.. ఇంకో దారుణం ... 40 కి. మీ దూరంలో...అమానవీయ ఘటన

మణిపుర్‌లో  ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలతో దేశమంతా అట్టుడుకుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై యాతవ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..తాజాగా మణిపూర్‌లో జరిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మే 4వ తేదీన మణిపూర్ లో   ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. 

మణిపూర్లోని నాంగ్‌పోక్ సెక్మాయ్ ప్రాంతంలో ఇద్దరు మహిళలపై అఘాయిత్యం జరిగిన రోజే ఆ ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  కాంగ్‌పోక్పీ ప్రాంతంలో ఉన్న కార్ సర్వీస్‌ సెంటర్లో ఇద్దరు యువతులు పనిచేసేవారు.  ఇద్దరు యువతులు తమ పనిలో ఉండగా కొంతమంది ఆ కార్ సర్వీస్ సెంటర్‌లోకి చొరబడి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి బయటకు లాగిపడేశారు. ఈ దారుణమైన ఘటనలో  ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారని వారి స్నేహితురాలు జాతీయ మీడియాకు తెలిపింది.  వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు యువతులు చనిపోయినట్లు తెలుస్తోంది. వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. తాను దూరం నుంచి చూసినట్లు బాధిత యువతుల స్నేహితురాలు చెప్పింది.

మణిపూర్.. రెండు నెలలుగా హింసతో రగిలిపోతున్నది. కొండ ప్రాంతాల్లో నివసించే మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే హైకోర్టు తీర్పును కుకీ, నాగా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మే 3న చురాచంద్​పూర్ జిల్లాలో చేపట్టిన ‘గిరిజన సంఘీభావ నిరసన యాత్ర’ ఇప్పటి అల్లర్లకు కారణమైంది. ర్యాలీ టైంలో ఓ సాయుధ గుంపు మైతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దాడి చేసింది. ఇది ప్రతీకార దాడులకు దారితీసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ రోజు మొదలైన ఘర్షణలు నేటికీ కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు, ఇండ్లు తగుల బెట్టుకోవడం, దోపిడీలు, హత్యలు కాస్తా మహిళలపై అత్యాచారాల దాకా తీసుకెళ్లింది. ఎస్టీ హోదా అడ్డుకుంటున్న కుకీ తెగకు చెందిన మహిళలు, యువతులు లక్ష్యంగా మైతీ వర్గం రేప్, హత్యలకు పాల్పడుతోంది.

అయితే మణిపూర్‌లోని నాంగ్‌పోక్ సెక్మాయ్ ప్రాంతంలో   మే 4వ తేదీన ఇద్దరు కుకీ తెగ మహిళలపై మెయితీ తెగకు చెందిన 800 నుంచి 1000 మంది గుంపు చేసిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇద్దరు మహిళలను  నగ్నంగా ఊరేగించి అనంతరం అందులోని ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాల్లోకి రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కుకీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చి....ఓ  వెదురు కంచెకు తలను వేలాడదీసిన ఘటనకు సంబంధించిన వీడియో జులై 20వ తేదీ శుక్రవారం బయటకు వచ్చింది.

మరోవైపు నాంగ్‌పోక్ సెక్మాయ్ ప్రాంతంలో ఇద్దరు మహిళలపై జరిగిన అమానుష ఘటనలో  ఐదో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.  మిగితా వారి కోసం కూడా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం మణిపూర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో 126 చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేసి  వెతుకుతున్నారు.