మణిపూర్ లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి

మణిపూర్ లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి
  • షాపులు ఓపెన్.. మళ్లీ సాధారణ జనజీవనం
  • ఇంఫాల్​లో రాష్ట్రానికి చెందిన 250 మంది స్టూడెంట్స్​ 
  • వారిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు

ఇంఫాల్: మణిపూర్ లో మైతై సామాజికవర్గాన్ని ఎస్టీ లిస్ట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 54కు పెరిగింది. మైతై, కుకీ వర్గాల వాళ్ల మధ్య ఘర్షణల్లో ఒక్క ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోనే 23 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిందని, శనివారం జనజీవనం సాధారణ స్థితికి చేరిందని చెప్పారు. ‘‘ఇంఫాల్ వ్యాలీలో దుకాణాలు, మార్కెట్లు రీఓపెన్ అయ్యాయి. వాహనాలు రోడ్డెక్కాయి. లోయలోని అన్ని మేజర్ ఏరియాల్లో భద్రతా బలగాలను మోహరించాం” అని అధికారులు తెలిపారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మొత్తం13 వేల మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, చురాచాంద్ పూర్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో రిజర్వ్ బెటాలియన్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై మణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అల్లర్లతో అట్టుడికిన తమ రాష్ట్రంలో పర్యటించాలని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల చాను విజ్ఞప్తి చేశారు. తమ బాధలను అర్థం చేసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు.