పారాలింపిక్స్: షూటింగ్‎లో భారత్‎కు మరో రెండు పతకాలు

పారాలింపిక్స్: షూటింగ్‎లో భారత్‎కు మరో రెండు పతకాలు

టోక్యో: పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా షూటింగ్ లో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. హర్యానాకు చెందిన మనీష్ నర్వాల్ 50 మీటర్ల మిక్స్ డ్ పిస్టల్ లో గోల్డ్ మెడల్ సాధించగా.. సింగ్ రాజ్ అదాన సిల్వర్ గెలుచుకున్నాడు. 19 ఏళ్ల మనీష్ పారాలింపిక్స్ లో రికార్డును సృష్టించాడు. అతను 218.2 పాయింట్లు సాధించి స్వర్ణం సాధించాడు. అదేవిధంగా సింగ్ రాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారాలింపిక్స్ లో తన రెండవ పతకాన్ని సాధించాడు. 

టోక్యో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు వారి రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. వీరిద్దరికీ హర్యానా ప్రభుత్వం నగదు పారితోషకంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ప్రకటించింది. గోల్డ్ మెడల్ సాధించిన మనీష్ నర్వాల్ కు రూ .6 కోట్లు మరియు రజత పతకం గెలిచిన సింగ్ రాజ్ అధానకు రూ .4 కోట్ల రివార్డు ఇస్తున్నట్లు తెలిపింది. 

అంతకుముందు టోక్యో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్ కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్-56లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు రూ. 4 కోట్ల రివార్డును కూడా ఆయన ప్రకటించారు. వీరిద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

బంగారు పతకం సాధించిన మనీష్ నర్వాల్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ‘టోక్యో పారాలింపిక్స్ లో భారత వైభవం కొనసాగుతోంది. యువ ఆటగాడు మనీష్ నర్వాల్ గొప్ప విజయం సాధించాడు. అతను స్వర్ణ పతకం సాధించడం భారతీయ క్రీడలకు ఓ ప్రత్యేక క్షణం. అతనికి నా అభినందనలు. రాబోయే కాలంలో మరిన్ని పతకాలు సాధించాలి’ అని మోడీ ట్వీట్ చేశారు.