"మంజుబా ను రసోడు" ఫుడ్‌‌ ట్రక్‌‌

"మంజుబా ను రసోడు" ఫుడ్‌‌ ట్రక్‌‌

పెరిగిన నిత్యావసర ధరలతో రోజులు గడవడమే కష్టంగా మారింది. ఏది కొనాలన్నా , నలుగురిని పిలిచి భోజనం పెట్టాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు. అలాంటిది రోజూ దాదాపు మూడు వందల మందికి పైగా ఫ్రీగా భోజనం పెడుతున్నాడు అహ్మదాబాద్‌‌కు చెందిన మయూర్‌‌‌‌. అది కూడా వాళ్లు తిన్నంత పెడుతున్నాడు. దానికోసం సెపరేట్‌‌గా మొబైల్ ట్రక్‌‌ ఒకటి డిజైన్‌‌ చేయించాడు. వాళ్ల అమ్మ మంజుబాయి జ్ఞాపకార్థం ఆ ఫుడ్‌‌ ట్రక్‌‌కు ‘మంజుబా ను రసోడు’ అని పేరు పెట్టాడు. 

ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనేది మా అమ్మ. ఆమె ఆఖరి కోరిక కూడా అదే.. ఆకలితో ఉన్నవాళ్ల కడుపు నింపాలని. అందుకే రోజూ 300 మందికి పైగా పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నా అంటాడాయన. ఎంఆర్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌ లిమిటెడ్‌‌ ఇండియా మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌గా ఉన్న మయూర్ తన తల్లి ఆలోచనల్ని సజీవంగా ఉంచుతూ, ఆమె చివరి కోరికను తీరుస్తున్నాడు.'

అమ్మ నేర్పిన గుణం 

‘‘మా అమ్మ మంజుబాయిది సేవా గుణం. ఆమె బతికున్నంత కాలం తన చుట్టుపక్కల ఆకలితో ఉన్నవాళ్లకు లేదనకుండా ప్రతి రోజూ వాళ్ల కడుపునింపేది. ఆకలితో ఎవరూ బాధ పడకూడదనేది ఆమె పాలసీ. ఆమెను చూస్తూ పెరిగిన నా‌‌కు కూడా అదే అలవాటయింది.  ఆ అలవాటే ఇప్పుడు మంజుబా ను రసోయి పెట్టేలా చేసింది.

కొవిడ్‌‌ టైంలో కూడా... 

కొవిడ్‌‌ టైంలో అహ్మదాబాద్‌‌లోని స్లమ్ ఏరియా ప్రజలకు రోజూ ఫుడ్‌‌ ప్యాకెట్‌‌లు పంచేవాళ్లం. లాక్‌‌డౌన్‌‌ వల్ల కొన్ని రోజులు ఆ ప్రోగ్రామ్‌‌ ఆపేయాల్సి వచ్చింది. అప్పుడే నాకు ఫుడ్‌‌ ట్రక్‌‌ ఆలోచన వచ్చింది. దాని వల్ల ఆకలితో ఉన్న వాళ్లు మన దగ్గరకు రావడం కాకుండా మనమే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు అనిపించింది. ఫుడ్‌‌ ట్రక్‌‌లో గ్యాస్‌‌ స్టవ్‌‌తో పాటు వంటకు కావాల్సిన సామాను పెడతాం. దాదాపు సగం వంటను మా ఇంటి దగ్గరే తయారుచేస్తాం. అందుకు క్యాటరింగ్‌‌ స్టాఫ్‌‌ను పెట్టుకున్నా. డొనేషన్స్‌‌ తీసుకోవడం నాకు నచ్చదు. ఒకసారి నాకు తెలియకుండా  కొందరు మూడున్నర లక్షల రూపాయలు జమచేసి నాకు పంపారు. ఆ డబ్బును తిరిగి పంపించా. ‘డొనేషన్‌‌లా కాకుండా మా వంతు బాధ్యతగా ఇస్తున్నాం. తీసుకో’ అని వాళ్లు బలవంత పెట్టారు. కాదనలేక ఆ డబ్బు తీసుకున్నా‌‌.

ఇన్విటేషన్‌‌ ఇచ్చి ఫుడ్ పెడుతూ...

రోజూ ఒకే దగ్గర కాకుండా ఒక్కోరోజు ఒక్కో వీధి తిరుగుతూ భోజనం పెడుతున్నా. ఏ ఏరియాలో, ఏ టైంలో భోజనం పెట్టాలనుకుంటున్నామో అక్కడికి ముందు రోజు వెళ్లి మైక్‌‌లో అనౌన్స్‌‌ చేస్తాం. తరువాత ఇన్విటేషన్‌‌లా ఉండే కరపత్రాలను అక్కడి వాళ్లకు పంచుతాం. మేము చేస్తున్నది సాయమే అయినా, ఒకరి దగ్గర చేయి చాపుతున్నాం అనే భావన వాళ్లకు కలగొద్దు. అందుకే మా ఇంటి ఫంక్షన్‌‌కి ఇన్విటేషన్‌‌ కార్డు ఎలా అయితే ప్రింట్‌‌ చేస్తామో అచ్చం అలానే ఆ పాంప్లేట్‌‌ ప్రింట్‌‌ చేయించాం. రోజూ ఒకే రకమైన మెనూ కాకుండా పూరి, చోలే, పావ్‌‌ బాజీ, సమోసా, పిజ్జాతో పాటు ఐస్‌‌ క్రీమ్‌‌, గులాబ్‌‌ జామ్‌‌ లాంటి రకరకాల ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ పెడుతున్నాం.