నటిగానే కాదు..మహిళగా కూడా స్ట్రాంగే..

నటిగానే కాదు..మహిళగా కూడా స్ట్రాంగే..

సమస్యలు వస్తే కొందరు కుంగిపోతారు. కానీ కొందరు మాత్రం వాటిని అధిగమించి ముందుకెళ్తారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు. తన జీవితాన్ని సరికొత్తగా మలచుకుంటారు. మంజు వారియర్‌‌లాగా... అందుకే మంజు వారియర్ ఓ నటిగానే కాదు.. ఓ మహిళగా కూడా ఎంతో స్ట్రాంగ్.  ఎందరో ఆమెను ఆరాధిస్తారు. మరెందరికి మంజువారియర్ ఇన్‌స్పిరేషన్‌. ఇవాళ మంజు వారియర్ పుట్టిన రోజు సందర్భంగా..ఆమె గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విశేషాలు.
 
‘సల్లాపమ్’ మూవీతో బ్రేక్
మంజు వారియర్..1978లో.. తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌‌కోయిల్‌లో జన్మించింది.  అయితే ఆమె తమిళియన్ కాదు. మలయాళీ. వాళ్ల నాన్న నాగర్‌‌కోయిల్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీ రీజినల్ ఆఫీసులో పని చేసేవారు. తల్లి గృహిణి. అన్నయ్య మధు నటుడు, నిర్మాత. మంజు ప్రైమరీ ఎడ్యుకేషన్‌ నాగర్‌‌కోయిల్‌లోనే జరిగింది. అయితే వాళ్ల నాన్నకు ప్రమోషన్ రావడంతో తిరిగి కేరళ వెళ్లిపోయింది. డిగ్రీ వరకు కన్నూరులో చదువుకుంది. మంజు చిన్నప్పట్నుంచీ మంచి కూచిపూడి డ్యాన్సర్‌‌. యూత్ ఫెస్టివల్స్లో  రెగ్యులర్‌‌గా ఇచ్చే ప్రదర్శనలు చూసి, దూరదర్శన్‌లో మోహరావమ్ అనే సీరియల్‌లో ఛాన్స్ ఇచ్చారు. 17 ఏళ్ల వయసులో ‘సాక్ష్యం’ మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన ‘సల్లాపమ్’ మూవీతో బ్రేక్ వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు వరుసగా సినిమా అవకాశాలొచ్చాయి.  

ప్రేమ..జీవితాన్ని మలుపు తిప్పింది..
రీర్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగేళ్లలోనే  మంజు వారియర్ ఇరవై వరకు సినిమాలు చేసేసింది.  అలాగే కంటిన్యూ అయితే కథ వేరేలా ఉండేది. కానీ తన తొలి హిట్‌ మూవీ ‘సల్లాపమ్‌’ హీరో దిలీప్‌తో ప్రేమలో పడటం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. 1998లో దిలీప్‌ని పెళ్లి చేసుకుని నటనకు దూరమైపోయింది. వారికి ఓ పాప పుట్టింది. పేరు మీనాక్షి. అంతా హ్యాపీగా ఉంటుందనుకున్న సమయంలో ఊహించని సమస్యలు రావడంతో దిలీప్‌తో తన బంధానికి విడాకులతో ఫుల్‌స్టాప్ పెట్టింది. నటి భావనని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడే ఈ దిలీప్. 

ఏడాదికి మూడు సినిమాలతో బిజీ..
పర్సనల్‌ లైఫ్ డిస్టర్బ్ అయినా మంజు వారియర్ కుంగిపోలేదు. పదహారేళ్లకు తిరిగొచ్చి కెరీర్‌‌పై దృష్టి పెట్టింది. 2014లో విడాకులకు అప్లై చేయగానే సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ యేడు నటించిన ‘హౌ ఓల్డ్ ఆర్యూ’ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం అందుకుంది. ఇక ఆ తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోయింది. ఏడాదికి  మూడు నాలుగు సినిమాలు చేస్తూ..ఫుల్ బిజీ అయిపోయింది. కన్ను మూసి తెరిచేలోగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఓడియన్, లూసిఫర్, అసురన్, మరక్కార్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచమయింది. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలతో పాటు తమిళంలో అజిత్ మూవీ, ఒక సినిమా చేస్తోంది. 

‘సల్లాపమ్’పేరుతో పుస్తకం..
సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక టెలివిజన్‌పై కూడా మంజు  మనసు పెట్టింది. హోస్ట్గా , జడ్జ్గా , గెస్ట్గా  తరచూ ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంటుంది.  పోయినేడు ప్రొడ్యూసర్‌‌గానూ మారింది.  చతుర్ముఖం, లలితం సుందరం చిత్రాలకు కో ప్రొడ్యూస్ చేసింది.  ఇక డ్యాన్స్తో  చూపు తిప్పుకోనివ్వని మంజు.. తన పాటతోనూ కట్టి పడేస్తుంటారు. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాల్లో పాటలు పాడారామె. ఆమె పాడే తీరు చూసి ప్రొఫెషనల్ సింగర్స్ సైతం ఆశ్చర్యపోతుంటారు. 2013లో ‘సల్లాపమ్’ పేరుతో ఓ పుస్తకం కూడా రిలీజ్ చేశారు మంజు. దీన్ని తన జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందించారామె.

అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ అసోసియేషన్లు..
మంజు వారియర్ గ్లామర్ పాత్రల జోలికి వెళ్లరు. హోమ్లీ క్యారెక్టర్లే ఒప్పుకుంటారు. తన నటనతో వారేవా అనిపించుకుంటారు. మలయాళంలో ఆమెకి వచ్చిన స్టార్‌‌డమ్ మరే హీరోయిన్‌కీ రాలేదు. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్స్తో  మోస్ట్ ఇన్ఫ్లెన్షియల్ ఎవరు అంటూ ఓ సంస్థ చేసిన సర్వేలో మంజు టాప్‌లో నిలిచారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్న ఏకైక మలయాళ నటి మంజు. 

సేవా కార్యక్రమాల్లోనూ ముందే..

మలయాళ ఇండస్ట్రీలోని మహిళలకు సాయపడే ‘ఉమన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే సంస్థ స్థాపకుల్లో మంజు ఒకరు. చాలా సోషల్ యాక్టివిటీస్‌లో ఆమె పాల్గొంటారు. తిరువనంతపురంలో సూర్య నిర్వహించిన నేషనల్ ఉమన్స్ టాక్ ఫెస్టివల్‌లో ఇనాగరల్ స్పీచ్ మంజునే ఇచ్చారు. ఎంతోమంది గొప్ప సేవ చేస్తున్నారని, వారిని ఎవరూ గుర్తించడం లేదని, తాను హీరోయిన్‌ని కావడం వల్ల కాస్త చేసినా ఎక్కువ పాపులారిటీ వస్తోందని, అంతే తప్ప తానేం గొప్పదాన్ని కాదంటూ ఆమె మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

వాయిస్ను స్ట్రాంగ్గా వినిపిస్తారు

ఎలాంటి విషయంలోనైనా మంజు తన వాయిస్‌ని చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తారు. ఎన్నో సందర్భాల్లో ఆమె తన ఒపీనియన్ని నిక్కచ్చిగా చెప్పారు. అలాగే ఏ నిర్ణయమైనా చాలా దృఢంగా తీసుకుంటారు. సనల్ కుమార్ డైరెక్షన్‌లో ‘కాయట్టం’ సినిమా చేశారు. ఆ సమయంలో సనల్‌ తనను మెసేజుల ద్వారా ఇబ్బంది పెట్టాడని, సినిమా పూర్తయ్యాక కూడా వెంటపడి వేధిస్తున్నాడని మంజు కంప్లయింట్ చేశారు.సనల్‌కి సపోర్ట్గా ఎంతోమంది మాట్లాడినా ఆమె తగ్గలేదు. తన వాదన గట్టిగా వినిపించారు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన స్నేహితురాలు భావన విషయంలో మాజీ భర్త దిలీప్ చేసినదాన్ని కూడా ఆమె ఖండించారని, భావనకు అండగా నిలబడ్డారని మాలీవుడ్‌వారు చెబుతుంటారు.

మంజు వారియర్ ..నటిగా వెండితెరపైనే కాక వ్యక్తిగా నిజ జీవితంలోనూ తనదైన శైలిలో సాగుతున్నారు. స్టార్‌‌డమ్‌ వచ్చినా సింపుల్‌గా ఉండటం..ఇండస్ట్రీలో అందరితో కలుపుగోలుగా వ్యవహరించే ఆమె తీరు చూసి ఫిదా అవ్వని వారుండరు. ఆమె మరిన్ని సంవత్సరాలు ఇంతే సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవాలని కోరుకుంటూ.. మంజు వారియర్‌‌కి బర్త్ డే విషెస్.