మన్ కీ బాత్.. ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేం.. ముంబై ఉగ్రదాడులపై మోదీ

మన్ కీ బాత్.. ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేం.. ముంబై ఉగ్రదాడులపై మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 107వ ఎడిషన్‌లో ప్రసంగిస్తూ 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులను గుర్తు చేసుకున్నారు. భారతదేశం అత్యంత హేయమైన ఉగ్రదాడిని ఎదుర్కొన్న ఈ రోజును దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు. నవంబర్ 26వ తేదీని మనం ఎప్పటికీ మరచిపోలేమని, ఈ రోజునే దేశం అత్యంత భయంకరమైన ఉగ్రదాడికి గురైందని ఆయన చెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా..

నవంబర్ 26వ తేదీ ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు, నవంబర్ 26 అనేది చాలా ముఖ్యమైనదని, 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని మోదీ అన్నారు.

‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారాలపై ప్రశంసలు

‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలనే ఈ కోరిక పండుగలకే పరిమితం కాకూడదని, పెళ్లిళ్ల సీజన్ రానున్నందున వెడ్డింగ్ షాపింగ్‌లో కూడా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.

చాలా మంది పెళ్లి చేసుకోవడానికి విదేశాలకు వెళుతున్నారని, భారతదేశంలో పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కొంతమందికి ఇలా చేసుకోవాలని ఉంటుందని తనకు తెలుసని, అయితే ఈ స్థాయిలో కూడా 'లోకల్ కోసం వోకల్'ని సీరియస్‌గా తీసుకుందామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉండనున్నాయి..  త్వరలోనే భారతదేశం ఆ స్థాయికి ఎదుగుతుందని మోదీ వివరించారు.