మన్నెగూడ యువతి కిడ్నాప్‌ కేసు : ‘అయామ్ నాట్ సేఫ్’  అంటూ అరిచిన నవీన్ రెడ్డి

మన్నెగూడ యువతి కిడ్నాప్‌ కేసు :  ‘అయామ్ నాట్ సేఫ్’  అంటూ అరిచిన నవీన్ రెడ్డి

ఆదిభట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన యువతి కిడ్నాప్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగింది. కిడ్నాప్ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని నిందితుల నుంచి రాబట్టాల్సి ఉందని పోలీసులు తమ కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుల నుంచి ప్రాసిక్యూషన్ కు సంబంధించిన వివరాలు రికార్డ్ చేయాల్సి ఉందని కోర్టుకు వివరించారు. నాగారం భానుప్రకాశ్‌ (20), రాథోడ్‌ సాయినాథ్‌ (22), గానోజి ప్రసాద్‌ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఆదిభట్ల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో విచారణ నిర్వహించారు. 

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అతడిని ఇప్పటికే హైదరాబాద్‌ కు తీసుకొచ్చిన పోలీసులు.. ఇవాళ రాత్రి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నవీన్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు.  అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లే క్రమంలో..అతడు మాస్క్ తీసేసి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ‘అయామ్ నాట్ సేఫ్’ అంటూ నవీన్ అరిచాడు. ‘‘నేను ఒక గంట మాట్లాడిన వీడియోను రిలీజ్ చేస్తే పోలీసులు మాత్రం కొద్దిగానే విడుదల చేశారు’’ అని కామెంట్ చేశాడు. ‘‘ఆ కొద్దిపాటి వీడియోను చూపించి నేను తప్పు ఒప్పుకున్నట్లు చిత్రీకరించారు’’  అని అరుస్తూ చెప్పాడు. 

ఈ కేసులో రుమాన్,  పవన్ ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.