- ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వైద్య ఖర్చులు ఎక్కువ
- మన దగ్గర ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి ..
- రూ.52,743 ఖర్చు.. దేశ సగటు రూ.34 వేలే
- చిన్నారులకు ఇన్ఫెక్షన్లు
- 30 ఏండ్లకే గుండె జబ్బులు
రోగమొస్తే... జేబులు గుల్లయిపోతున్నాయి. ఏమి రోగాలు దేవుడా.. అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో విచ్చలవిడి ఫీజులతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఖరీదైపోతున్నది.సగటున ఏడాదికి ఒక్కో వ్యక్తి ఆస్పత్రి ఖర్చులు రూ.52,743 గా ఉన్నట్లు తేలింది. సగటు ఖర్చు రూ.50 వేలు దాటిన ఏకైక రాష్ట్రం మనదే కావడం ఆందోళన కలిగిస్తున్నది.
చిన్నారులకు ఇన్ఫెక్షన్లు.. 30 ఏండ్లకే గుండె జబ్బులు
చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువ.. 45 శాతం మందికి ఆ సమస్యలు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 44 ఏండ్ల వయసున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగానే ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు (16.3), గాయాలు (16.5 శాతం) వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక 30 ఏండ్ల వయస్సు నుంచే గుండెజబ్బుల బారిన పడ్తున్నారు. 30 నుంచి 44 ఏండ్ల మధ్య ఉన్న వారిలో 7.3 శాతం మందికి గుండె జబ్బుల బారిన పడినట్లు నివేదిక వెల్లడించింది.
ఇక, 60 ఏండ్లు దాటిన వారిలో ఆ సమస్య తీవ్రంగా ఉంది. 18.2 శాతం మందికి గుండె జబ్బులు వస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 45 నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వారిలోనూ 13.9 శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. మొత్తంగా అన్ని ఏజ్ గ్రూపులు కలిపితే అత్యధికంగా గుండె జబ్బుల సమస్యే ఉన్నట్టు వెల్లడైంది. 25.6 శాతం మందికి గుండె జబ్బులతో బాధపడుతున్నట్టు వెలుగుచూసింది. ఆ తర్వాత హార్మోన్ల అసమతుల్యత, పోషకాహారలోపం, లివర్ సమస్యలు 24.2 శాతం మందికి ఉన్నట్టుగా తేలింది. ఆరోగ్య సమస్యలు అత్యధికంగా వృద్ధుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం సర్వేలో వెల్లడైంది. 60 ఏండ్లుపైబడిన వారిలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నట్టు తేలింది.
80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో భాగంగా 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్సంప్షన్: హెల్త్’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1,39,732 కుటుంబాల్లోని 6,51,440 మందిని సర్వే చేసింది. తెలంగాణలో 4,504 కుటుంబాల్లోని 17,233 మంది నుంచి వివరాలు సేకరించారు. ఆ సర్వే రిపోర్టును ఈ నెల 20న విడుదల చేసింది. ఆ సర్వే రిపోర్టులోనే ఈ ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ వైద్య ఖర్చులు రూ.50 వేలు దాటడంలేదు. ఇటు దేశ సగటు వైద్య ఖర్చులు రూ.34 వేలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగటు వైద్య ఖర్చు రూ.72,561 అవుతుండగా.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులు కేవలం రూ.5,856గా ఉంది. చారిటబుల్ ఆస్పత్రుల్లోనూ సగటున రూ.46,849 మేర వైద్యానికి ఖర్చవుతున్నది. కాగా, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే వైద్య ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది.
పట్టణాల్లో సగటున రూ.59,043 ఖర్చవుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో అది కేవలం రూ.48,023గా ఉంది. కాగా, ఓవరాల్‌గా మనకన్నా ముందు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రూ. 80,478 చొప్పున వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో రూ.42,517 ఖర్చవుతున్నట్టు నివేదిక తేల్చింది. తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో రూ.40 వేల నుంచి రూ.48 వేల వరకు సగటున ఒక్కో వ్యక్తి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నట్టు వెల్లడైంది.

