
న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ లోనూ చాలా మంది కట్టప్పలు ఉన్నారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చే దిశలో వారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి వెనుక బీజేపీ హస్తం మాత్రం లేదని స్పష్టం చేశారు. పార్టీలోని లుకలుకలు, అసంతృప్తులే ఇందుకు కారణమన్నారు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన లక్ష్మణ్‌తో చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత సౌత్ ఎవెన్యూలోని ఎంపీ క్లబ్లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలోని కట్టప్పలు ఎప్పుడు బయటికి వస్తారో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చలేదని, తెలంగాణలోనూ కూల్చబోదని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరిగితే టీఆర్ఎస్ పార్టీకి కూడా శివసేన పరిస్థితి వస్తుందన్నారు.
అసలు సినిమా ముందుంది..
బీజేపీలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. పుత్ర వాత్సల్యం వల్లే కూలిన ప్రభుత్వాలు పుత్ర వాత్సల్యంతో అన్ని పార్టీల ప్రభుత్వాలు కూలిపోయాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. థాక్రే, ములాయం, లాలూ ప్రభుత్వాలు కూకటి వేళ్లతో తుడిచి పెట్టుకుపోయాయని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం చేస్తున్న పుత్ర వాత్సల్య విన్యాసాలకు మహారాష్ట్ర లాంటి పరిస్థితే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందన్నారు. అసెంబ్లీ రద్దు వరకే కేసీఆర్ చేతిలో ఉందన్న లక్ష్మణ్, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని అన్నారు. ఆగస్టు నుంచి పల్లె పల్లెకు.. గడప గడపకు.. మోడీ సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ అవినీతి విధానాలను చేరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లీడర్లు వెదిరె శ్రీరాం, కామరుసు బాల సుబ్రమణ్యం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.