పెండ్లి లీవ్స్.. చైనాలోని కొన్ని ప్రావిన్స్​లలో ప్రభుత్వాల ప్రకటన 

పెండ్లి లీవ్స్.. చైనాలోని కొన్ని ప్రావిన్స్​లలో ప్రభుత్వాల ప్రకటన 
  •     బర్త్ రేట్ తగ్గి.. ఎకానమీపై ఎఫెక్ట్ పడుతుండటంతో నిర్ణయం 

బీజింగ్: ‘నెల రోజులు జీతంతో కూడిన సెలవులు ఇస్తాం. పెండ్లి చేసుకుని, పిల్లల్ని కనండి’ అంటూ చైనాలోని పలు ప్రావిన్స్ లలో ఉద్యోగులకు స్థానిక ప్రభుత్వాలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు పెండ్లి చేస్కుంటే కేవలం మూడ్రోజులే జీతంతో కూడిన సెలవులు ఇస్తారు. కానీ.. దేశంలోని కొన్ని ప్రావిన్స్ లలో, సిటీల్లో బర్త్ రేట్ దారుణంగా పడిపోతోంది. ఫలితంగా అర్థిక అభివృద్ధిపైనా ఎఫెక్ట్ పడుతోంది. అందుకే.. బర్త్ రేట్ ను, పాపులేషన్ ను పెంచేందుకు పలు ప్రావిన్స్​ల ప్రభుత్వాలు ఇలా 30 రోజుల పెండ్లి సెలవులను ప్రకటించాయని ఈ మేరకు చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక ‘డైలీ హెల్త్’ వెల్లడించింది.

‘‘యువతీయువకులు త్వరగా పెండ్లి చేసుకుని, పిల్లలను కనేందుకు ఇది ప్రోత్సాహకంగా నిలుస్తుంది. బర్త్ రేట్ ను పెంచేందుకు మ్యారేజ్ లీవ్స్ ను పెంచడం మంచి మార్గం” అని సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఫైనాన్స్, ఎకనమిక్స్ డీన్ యాంగ్ హయాంగ్ అభిప్రాయపడ్డారని పేర్కొంది. కాగా, చైనా కఠినంగా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా1980 నుంచి 2015 వరకు ఆ దేశ జనాభా పెరుగుదల భారీగా తగ్గిపోయింది. దీనివల్ల దేశ ఎకానమీపైనే ప్రభావం పడినట్లు ఎక్స్​పర్ట్​లు చెప్తున్నారు. దేశంలో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.