మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న కౌన్సిలర్ల రాజీనామాలు

మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న కౌన్సిలర్ల రాజీనామాలు

కామారెడ్డి : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ.. రైతులకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ పదవులకు బీజేపీ కౌన్సిలర్లు సుతారి రవి, కాసర్ల శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ నెల 17న పాత రాజంపేట గ్రామంలో రైతులకు రాజీనామా లేఖలు అందజేశారు. ఇవాళ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు రాజీనామాలు అందజేశారు. మాస్టర్ ప్లాన్  ను రద్దు చేసే తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి లోపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే బీజేపీకి చెందిన మిగిలిన కౌన్సిలర్లు కూడా ఈ నెల 23న రాజీనామా చేస్తారని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 23వ తేదీ లోపు మాస్టర్ ప్లాన్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని మరో బీజేపీ కౌన్సిలర్ గాండ్ల సుజాత  ప్రకటించారు. గాండ్ల సుజాత 34వ వార్డు నుండి బీజేపీ తరపున కౌన్సిలర్ గా గెలిచారు. 

 కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు సర్వత్రా మద్దతు పెరుగుతోంది. రైతులకు మద్దతుగా నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి రాజీనామా పత్రాలను కౌన్సిలర్లు అందజేశారు. బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయడంతో అధికార పార్టీ కౌన్సిలర్లపైనా ఇప్పుడు ఒత్తిడి మరింత పెరుగుతోంది. రేపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇంటిని ముట్టడించాలని నిర్ణయించారు.