రాష్ట్రవ్యాప్తంగా పలు ఆర్టీసీ డిపోలు క్లోజ్​

 రాష్ట్రవ్యాప్తంగా పలు ఆర్టీసీ డిపోలు క్లోజ్​
  • జిల్లాల్లోనూ మొదలైన మూసివేతలు
  • బస్సులు, సిబ్బంది ఇతర డిపోలకు అటాచ్​
  • విలువైన డిపో స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను
  • కొన్నిచోట్ల ఇప్పటికే లీజుకిచ్చినట్టు ఆరోపణలు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు, సంఘాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆర్టీసీ డిపోలు మూతపడుతున్నాయి. దశలవారీగా డిపోలను మూసివేస్తున్న అధికారులు అక్కడున్న బస్సులను, సిబ్బందిని ఇతర డిపోలకు పంపిస్తున్నారు. దీనిపై కార్మికులు, యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్​లో ఇప్పటికే రాణిగంజ్ 1, 2, ముషీరాబాద్ 1,2, మియాపూర్ 1, 2 డిపోల్లో ఒక్కొక్కటి చొప్పున మూసివేశారు. హయత్ నగర్, బర్కత్ పుర ఏరియాల్లో రెండు చొప్పున డిపోలు ఉండగా వాటిని కలిపేశారు. బస్ భవన్ వెనకున్న హైదరాబాద్ 2 డిపోనూ  మూసివేశారు. శాటిలైట్ డిపోలతో కలిపి రాష్ట్రంలో 99 డిపోలున్నాయి. వీటిలో లాభాలు రాని, నష్టాలు ఎక్కువున్న డిపోలను మూసివేసేందుకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. అయితే కొత్త జిల్లాగా ఏర్పడిన ములుగుతోపాటు పలు ఏరియాల్లో డిపోలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ కార్మికులు నుంచి వస్తోంది. చండూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తామని మునుగోడు బైపోల్ ప్రచారంలో మంత్రులు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్​ కోడ్​ ముగియడంతో డిపో ఏర్పాటుపై కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 

నార్కెట్​పల్లి డిపో మూత?

హైదరాబాద్– విజయవాడ నేషనల్​ హైవేపై ఉన్న నార్కెట్​పల్లి డిపోను సైతం మూసివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి బస్సులను ఇప్పటికే నల్గొండ డిపోకు పంపించారు. ఉద్యోగులనూ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి డిపోలకు పంపిస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. నేషనల్ హైవే పక్కనున్న ఈ డిపోకు  కోట్ల విలువైన ల్యాండ్ ఉంది. దాన్ని ఏం చేస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నరు. హుస్నాబాద్, ఉట్నూరు డిపోలనూ మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. 

ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిపో స్థలాలు

ఇప్పటికే మూసివేసిన ముషీరాబాద్ 1, హైదరాబాద్ 3 డిపో స్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతున్నది. అయితే వీటిని ప్రైవేట్ వ్యక్తులు ఆపరేట్ చేస్తారని, ఆ స్థలాల నిర్వహణ వాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధికార పార్టీ నేతలకు లీజు?

మూసి వేసిన డిపో స్థలాల నుంచి ఆర్టీసీ ఆదాయం పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ భూములపై కన్నేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.  వరంగల్​లో అధికార పార్టీ ఎంపీకి విలువైన డిపో స్థలాన్ని లీజుకిచ్చినట్టు తెలుస్తోంది. అందులో భారీ షాపింగ్ మాల్, మల్టీఫ్లెక్స్ నిర్మించనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో సైతం అధికార పార్టీ ఎమ్మెల్యే డిపో స్థలాన్ని లీజ్​కు తీసుకుని షాపింగ్ మాల్, మల్టీఫ్లెక్స్ కు ప్లాన్  చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. 

ఆర్టీసీని బాగు చేయాలనే ఆలోచన సీఎంకు లేదు 

ఆర్టీసీ డిపోలను, బస్సులను తగ్గిస్తున్నరు. ప్యాసింజర్లు పెరుగుతుంటే ప్రజా రవాణాను బలోపేతం చేయాల్సింది పోయి ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నరు. రోజురోజుకు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పెరుగుతోంది. ఆర్టీసీని బాగు చేయాలనే ఆలోచన కేసీఆర్​కు లేదు.  డిపోల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. - హన్మంతు ముదిరాజ్, ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్​లో వెయ్యి బస్సులు తగ్గించారు 

సిటీలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను 3,700 నుంచి 2,700 కు తగ్గించారు. డిపోలను మూసివేస్తున్నరు. జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. బెంగళూరులో 7 వేల బస్సులుంటే ఇక్కడ 3 వేలు కూడా లేవు. చాలా కాలనీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు లేవు.  - రాజిరెడ్డి, ఆర్టీసీ జేఏసీ

ఎలక్ట్రిక్ బస్సులు వస్తే  ప్రైవేట్ వ్యక్తుల హవా

ఆదాయం రావట్లేదని డిపోలు, బస్సులను తగ్గిస్తున్నరు. ఉద్యోగులను వీఆర్ ఎస్ పేరుతో ఇంటికి పంపుతున్నరు. రానున్న రోజుల్లో 4 వేల ఎలక్ట్రిక్ బస్సులు వస్తే వాటిని  ప్రైవేట్ వ్యక్తులే ఆపరేట్​చేస్తరు. అప్పుడు ఆర్టీసీ కార్మికుల అవసరం ఉండదు. రిక్రూట్ మెంట్లు ఆగుతయ్. శాటిలైట్ పేరుతో దశలవారీగా డిపోల సంఖ్య తగ్గిస్తున్నారు. విస్తరించాల్సింది పోయి తగ్గించడం బాధాకరం. - వీఎస్ రావు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ జనరల్ సెక్రటరీ