మోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..? 

మోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..? 

మోండా మార్కెట్ లోని ఓ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ టీవీ ఫుటీజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక ప్రశ్నలు, మరెన్నో ట్విస్టులు తెరపైకిస్తున్నాయి. ఈ చోరీ బాగా తెలిసిన వాళ్లే చేశారనే అనుమానులు బలపడుతున్నాయి. యజమాని లోకల్ లో లేడని తెలిసే ఈ చోరీకి స్కెచ్ వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. శనివారం (మే 27న) మోండా మార్కెట్‌లోని ఓ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ఐటీశాఖ అధికారులమని చెప్పి... గోల్డ్ తనిఖీలు చేపట్టారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం సిబ్బందిని ముందుగా భయపెట్టారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని ఓవైపున సైలెంట్ గా కూర్చోబెట్టారు. షాపులో ఉన్న బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించలేదని చెప్పి.. గోల్డ్ ను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి నోటీసులు షాపు సిబ్బందికి ఇవ్వకుండానే అక్కడి నుంచి బంగారంతో పారిపోయారు. 

ఇది బాగా తెలిసిన వాళ్ల పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే.. సూటు, బూటుతో వెళ్లిన ఐదుగురు వ్యక్తులు.. ఐటీశాఖ అధికారుల తరహాలో తనిఖీలు చేపట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా... ఎవరికీ... ఎలాంటి అనుమానం రాకుండా సోదాలు చేశారు. మోండా మార్కెట్ లో వేల సంఖ్యలో షాపులు ఉంటాయి. గోల్డ్ షాపులు కూడా పదుల సంఖ్యలో ఉంటాయి. ఏ షాపునకు వెళ్లనిదొంగల ముఠా.. ప్రత్యేకంగా ఈ షాపునకే ఎందుకు వెళ్లారు...? సిబ్బందిని ఏమని బెదిరించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన రివెన్‌ మధుకర్‌ బవర్‌ అనే వ్యక్తి... నాలుగు నెలల క్రితం నుంచి మోండా మార్కెట్‌లో బంగారం షాపు రన్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మధుకర్‌ సొంతూరు వెళ్లడంతో అతని బావమరిది వికాస్‌ ఖేదకర్‌ అనే వ్యక్తి గోల్డ్‌ షాప్‌లో తయారీ పని చూసుకుంటున్నాడు. వికాస్‌ ఖేదర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో మరో గోల్డ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. చోరీ జరిగిన సమయంలో షాపులో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఆ సమయంలో వచ్చిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు) ఎత్తుకెళ్లారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టి వెళ్లిపోయారు. ఇది బాగా తెలిసిన వాళ్ల పనేనని డీసీపీ చందన దీప్తి చెబుతున్నారు.

గతంలోనూ ఇలాంటి తరహాలు ఎన్నో జరిగాయి. ఇలాంటి కేసులను గంటల వ్యవధి, రోజుల వ్యవధిల్లోనూ పోలీసులు చేధించారు. ఈ కేసును కూడా పోలీసులు త్వరగానే చేధిస్తారని అందరూ భావిస్తున్నారు.