జవాన్లే లక్ష్యంగా ఛత్తీస్​గఢ్​లో .. మందుపాతరలు పేల్చిన మావోయిస్టులు

జవాన్లే లక్ష్యంగా ఛత్తీస్​గఢ్​లో .. మందుపాతరలు పేల్చిన మావోయిస్టులు
  • సుక్మా, నారాయణ్​పూర్​ జిల్లాల్లో ఘటనలు  
  • నలుగురికి తీవ్ర గాయాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం

భద్రాచలం, వెలుగు :  ఛత్తీస్​గఢ్​రాష్ట్రంలో మావోయిస్టులు రెండు వేర్వేరు జిల్లాల్లో జవాన్లను లక్ష్యంగా చేసుకుని సోమవారం మందుపాతరలు పేల్చారు. ఒక చోట నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడగా, మరో చోట ల్యాండ్​మైన్​ను గుర్తించి నిర్వీర్యం చేశారు. సుక్మా జిల్లా దబ్బమరక సీఆర్పీఎఫ్​ క్యాంపు- సలాతోంగ గ్రామ అడవుల్లో రోడ్డు నిర్మాణ పనుల రక్షణకు వెళ్లిన జవాన్లను టార్గెట్​ చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో డీఆర్​జీ జవాన్లు లక్ష్మణ్​తంతన్, కె.భీమా, మంటూ కుమార్, అరుణ్​ కార్తీక్​ తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని హెలీకాప్టర్​ ద్వారా దవాఖానకు తరలించారు. వీరిలో మంటూ కుమార్, అరుణ్​కార్తీక్​ పరిస్థితి విషమంగా ఉంది. నారాయణ్​పూర్​జిల్లాలో పల్లీ-బార్సూర్​అటవీ గ్రామాల మధ్య మావోయిస్టులు చెట్టును నరికి రోడ్డుకు అడ్డంగా పడేసి దాని కింద మందుపాతర అమర్చారు. విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్​జవాన్లు చెట్టును తొలగించి, మందుపాతరను బాంబుస్క్వాడ్​ సాయంతో నిర్వీర్యం చేశారు.