‘1/70’కి విరుద్ధంగా కొన్న భూములు వదిలేయండి

‘1/70’కి విరుద్ధంగా కొన్న భూములు వదిలేయండి

1/70 చట్టానికి విరుద్ధంగా భూములను కొనొద్దని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. 1/70 చట్టానికి విరుద్ధంగా ఇప్పటివరకు కొన్న భూములను వెంటనే విడిచి పెట్టాలన్నారు.  అడ్డదారిలో భూస్వాములకు పట్టాలు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఈమేరకు మావోయిస్టు ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కార్యదర్శి సబిత పేరిట ఓ లేఖ విడుదలైంది. ఏటూరునాగారం, రామన్నగూడెం, కొండాయి, పప్ కాపూర్, పలిమెల, సంకెన, సూరారం, ఆజాంనగర్, గద్దనపల్లి, మొందేడు (భీమనపల్లి) ప్రాంతాల పట్టా భూములను.. ఏటూరునాగారం, మహదేవ్ పూర్ ఏరియాలోని స్థలాలను రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్లు కొంటున్నారని సబిత మండిపడ్డారు. 

అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు.. అధికారులకు లంచాలిచ్చి ఆదివాసీల సాగు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని  ఆరోపించారు. అలా స్వాధీనం చేసుకున్న భూములను చూపించి.. రైతుబంధు పథకం ద్వారా కూడా అక్రమ లబ్ధిని పొందుతున్నారని వివరించారు. అవే భూముల పేరిట బ్యాంకు లోన్లు సైతం తీసుకొని తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇంకొంతమంది ఆదివాసీలకు అప్పులు ఇచ్చి.. వాళ్లు అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితికి చేరినప్పుడు సాగు భూములను కబ్జా చేస్తున్నారని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.