
- జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్టూడెంట్లతో సైన్స్ ప్రదర్శనలు
- సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జడ్పీహెచ్ఎస్లో విధులు
నల్గొండ, వెలుగు: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్గా ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా ఎంపికైన 45 మంది టీచర్లలో తెలంగాణ నుంచి ఆమె ఒక్కరికే అవార్డు దక్కింది. సరికొత్త పద్ధతుల్లో.. స్టూడెంట్లకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన అందించడం వల్లే జాతీయ స్థాయిలో ఆమెకు ఉత్తమ్ టీచర్ అవార్డ్లభించింది.
పవిత్ర మాట్లాడుతూ.. బయోసైన్స్ బోధించే తనకు సైన్స్‌లో కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఆసక్తి ఉండేదని, అందులో భాగంగానే విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించినట్టు చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు వారి ప్రయోగాలను ప్రాజెక్టుల రూపంలో సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శించినట్టు చెప్పారు. చాలామంది విద్యార్థుల ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు.
ఎనిమిదేండ్లకు పైగా గడ్డిపల్లి హైస్కూల్లో పనిచేసిన పవిత్ర.. గతేడాది పెన్‌పహాడ్‌కు బదిలీ అయ్యారు. ఆమె మార్గదర్శకత్వంలో గడ్డిపల్లి, పెన్‌పహాడ్ స్టూడెంట్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. గడ్డిపల్లి విద్యార్థులు ఐఐటీ ఢిల్లీలో ప్రదర్శనలిచ్చారు.2021లో ఎన్సీటీఎస్ నిర్వహించిన సైన్స్ ప్రోగాంలో ఆమెకు ‘సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డు’ దక్కింది.
ఐసీటీ మోడ్‌తో టీచింగ్ సులభం..
ఇంటిగ్రేషన్ఆఫ్ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) మోడ్‌లో పిలల్లకు పాఠాలు చెప్తున్నట్టు పవిత్ర చెప్పారు. ఈ పద్ధతిలో కఠినమైన పాఠ్యాంశాలు, కాన్సెప్ట్స్ విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయన్నారు. కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఇంటర్నెట్ను వాడటం వల్ల పిల్లలు సులువుగా పాఠాలు నేర్చుకుంటారని, చదువుపై ఆసక్తి లేని వారు కూడా క్లాస్‌రూమ్‌లో పెద్ద స్క్రీన్లపైన బయాలజీ పాఠాలు నేర్చుకుంటారన్నారు.
బయాలజీకి సంబంధించిన కార్డు గేమ్స్, బోర్డుగేమ్స్ కూడా తయారు చేయించినట్టు చెప్పారు. దీనివల్ల తనకు 2022లో జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు, 2023లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు దక్కిందని, ఇప్పుడు జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు పవిత్రను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, డీఈవో అశోక్ అభినందించారు. వచ్చే నెల 5న ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోనున్నారు.