
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలం అశోద గ్రామంలోని పంట చేలల్లో సాగు చేస్తున్న160 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ జీవన్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
గంజాయి మొక్కలు పెంచుతున్నారనే పక్కా సమాచారంతో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన మేస్రం భుజంగ్‌రావు తన చేనులో పత్తి, కంది పంటలో అంతర్ పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి మొక్కల విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా కలెక్టర్ కు నివేదికలు పంపిస్తున్నట్లు చెప్పారు. రూరల్ సీఐ కె ఫణిధర్, ఎస్సై వి విష్ణువర్ధన్, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.