బెంగాల్ నుంచి గంజాయి ట్రాన్స్ పోర్ట్.. ఇద్దరు అరెస్ట్ .. 41 కిలోల గంజాయి సీజ్

బెంగాల్ నుంచి గంజాయి ట్రాన్స్ పోర్ట్.. ఇద్దరు అరెస్ట్ .. 41 కిలోల గంజాయి సీజ్

హసన్ పర్తి, వెలుగు: అమ్మేందుకు గంజాయిని తెస్తున్న ఇద్దరిని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.20.50 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహరావు బుధవారం కాకతీయ వర్సిటీ పీఎస్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ లోని కుచ్ బిహార్ ప్రాంతానికి చెందిన రాను హుస్సేన్, నూర్ మహమ్మద్ మియా ఫ్రెండ్స్. వీరు ఈజీ మనీ కోసం గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేశారు.

గత నెలలో రూ. 2 లక్షలకు కృష్ణ చంద్ర బర్మన్ వద్ద 41 కిలోల  గంజాయి కొనుగోలు చేసి బ్యాగుల్లో తీసుకుని కుచ్ బిహార్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ వెళ్లే రైలు ఎక్కారు. రైల్వే పోలీసులకు భయపడి మంగళవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి హనుమకొండ బస్ స్టేషన్ కు చేరుకుని, బస్సు ఎక్కి ముచ్చర్ల క్రాస్ వద్ద దిగారు.  సికింద్రాబాద్ వెళ్లేందుకు లారీలను ఆపుతుండగా కాకతీయ వర్సిటీ పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.