స్వింగ్ క్వీన్: భువీని గుర్తు చేసిన సఫారీ మహిళా బౌలర్

స్వింగ్ క్వీన్: భువీని గుర్తు చేసిన సఫారీ మహిళా బౌలర్

మోడ్రన్ క్రికెట్ లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్, రివర్స్ స్వింగ్ తో భువీ తన స్వింగ్ పవర్ ను చూపిస్తాడు. ముఖ్యంగా కొత్త బంతితో ఈ ఉత్తర ప్రదేశ్ బౌలర్ చుక్కలు చూపిస్తాడు. ప్రస్తుతం భువీ లేకపోవడంతో  పరిమిత ఓవర్లలో ఆ స్థాయి బౌలింగ్ వేసేవారు లేరనే చెప్పాలి. అయితే ఒక మహిళా క్రికెటర్ మాత్రం తన స్వింగ్ తో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ను బోల్తా కొట్టించింది.
 
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మారిజానే కాప్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి తన ఇన్ స్వింగ్ పవర్ ను చూపించింది. కాప్ వేసిన ఈ బంతి అనూహ్యంగా లోపలి తిరిగి మిడ్ వికెట్ ను గిరాటేసింది. వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ బెత్ మూనీకు కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. షాక్ కు గురవుతూ కాసేపు అక్కడే ఉండిపోయింది. ఈ బంతితో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను గుర్తుకు తెచ్చింది. 

ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో సఫారీలు 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. మారిజానే కాప్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 149 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్ కిమ్ గార్త్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. మారిజానే కాప్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడు వన్డేల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.