
- ఓఆర్ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా..
- ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు
- అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల రేట్ కొద్దిమేర సవరణ
- కమర్షియల్ స్పేస్ రేట్లు మాత్రం తగ్గింపు
- ఎస్‌ఎఫ్‌టీకి రూ.1,500 మేర తగ్గే చాన్స్
- కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే నెలలో అమల్లోకి.
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్గెట్వ్యాల్యూ భారీగా పెరగనుంది. గరిష్టంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్పరిసర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ప్లాట్ల విలువ కూడా మూడింతలు పెరిగే చాన్స్ ఉంది. అలాగే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ కొద్దిమేర పెరగనుండగా, కమర్షియల్స్పేస్రేట్లు మాత్రం తగ్గనున్నాయి. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. వాటికి కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే నెలలో కొత్త మార్కెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు, బహిరంగ మార్కెట్ రేట్లకు అనుగుణంగా భూముల విలువలు పెంచేందుకు గాను మార్కెట్ వ్యాల్యూను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్కార్‌కు ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్‌లో అసమానతలు తగ్గుతాయని భావిస్తున్నది. ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూతో పోలిస్తే బహిరంగ మార్కెట్ రేట్ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనే సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తొలుత కోర్అర్బన్ఏరియా వరకే భూముల విలువ పెంచాలని అనుకున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి చేయాలని భావిస్తున్నది. కాగా, పోయినేడాది జూన్‌లోనే భూముల విలువలు సవరించాలని ప్రభుత్వం అనుకున్నది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ కమిటీలు ఏర్పాటు చేసి కొత్త ప్రతిపాదనలు తెప్పించుకుంది. ఇప్పుడు వాటి ఆధారంగా సవరణలు చేయనుంది.
కోర్ అర్బన్ ఏరియాలో భారీగా పెంపు..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వ్యవసాయ భూముల రేట్లు భారీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్ వ్యాల్యూ పెంచి, వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం రావడంతో పాటు రైతులకూ లాభం చేకూరుతుందని భావిస్తున్నది. ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షల మార్కెట్ వ్యాల్యూ ఉన్న భూమి విలువ రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ వ్యాల్యూ రూ. 20 లక్షలు ఉండగా, దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతున్నది. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 300 శాతానికి పైగా పెరగనున్నాయి.
పెరగనున్న ఓపెన్ ప్లాట్ల రేట్లు..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిసరాల్లోని నివాస స్థలాల విలువలు భారీగా పెరగనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల రేట్లు గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రస్తుత డిమాండ్‌ను, మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకుని రెండు నుంచి మూడింతలు పెంచేలా నిర్ణయం తీసు కున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి వాటితో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతు న్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు పెరగనున్న మార్కెట్ వ్యాల్యూ బహిరంగ మార్కెట్ రేట్లకు తగ్గట్టుగా ఉండనుంది. ఈ పెంపుతో ఓఆర్ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు చేయాలను కునే వారికి రిజిస్ట్రేషన్ ఖర్చులు కొంతమేర పెరిగే అవకా శం ఉంది. కానీ, ఇది దీర్ఘకాలంలో భూముల విలు వ, వాస్తవ మార్కెట్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తుందని అధికారులు చెప్తున్నారు. దీంతో బ్లాక్‌మనీ లావాదేవీలు తగ్గుతాయని, రియల్ ఎస్టేట్ లో మరింత పారదర్శకత వస్తుందని అంటున్నారు.
అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కూడా..
అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల విలువలను కొద్దిమేర పెం చాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎస్‌ఎఫ్టీకి రూ.2,200 ఉండగా, దాన్ని రూ.2,800 వరకు పెంచనున్నారు. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, స్థిరమైన మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్ రేట్లకు తగ్గట్టుగా ప్రభుత్వ విలువను సవరిస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల విలువలను కొద్దిమేరనే పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలపై పెద్దగా భారం పడదని అంటున్నారు.
కమర్షియల్ స్పేస్ రేట్లు తగ్గింపు..
వాణిజ్య స్థలాల (కమర్షియల్ స్పేస్) విలువలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తగ్గింపు ఉండనుంది. ప్రస్తుతం ఎస్‌ఎఫ్టీకి రూ.7 వేలు ఉన్న వాణిజ్య స్థలాల విలువను రూ.6,500కి తగ్గించాలని రిజిస్ర్టేషన్ల శాఖ ప్రతిపాదించింది. ఈ తగ్గింపు ప్రధానంగా వ్యాపారాలకు, పారిశ్రామిక రంగానికి మేలు చేయనుంది. కొత్త కంపెనీలు తమ కార్యాలయాలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అలాగే వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గడం వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ఉద్యోగాల సృష్టికి కూడా దోహదపడుతుంది. గతంలో అవసరానికి మించి ఎక్కువగా నిర్ణయించిన విలువలను సరిచేసి, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.