చనిపోయిన ప్రేమ జంటకు పెండ్లి

చనిపోయిన ప్రేమ జంటకు పెండ్లి

గాంధీ నగర్: ఓ అబ్బాయి, అమ్మాయి  ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించలేదు. పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దాంతో యువకుడు, యువతి కలిసి సూసైడ్ చేసుకున్నారు. అది చూసిన పెద్దలు, గ్రామస్తులు తీవ్రంగా కలత చెందారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి, అబ్బాయిల విగ్రహాలు చేయించి వాటికి పెళ్లి చేశారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని తాపీ జిల్లాకు చెందిన గణేశ్, రంజనల లవ్ స్టోరి ఇది. జిల్లాలోని నిజార్ తాలూకా నేవాలా గ్రామానికి చెందిన గణేశ్(21), రంజన(20) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ల లవ్ గురించి కుటుంబసభ్యులకు చెప్పడానికి  2022 ఆగస్ట్ లో రంజనాను గణేశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, పెద్దలు వాళ్ల ప్రేమను ఒప్పుకోలేదు. పెండ్లి చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

అయినా, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆ ప్రేమికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేదు అనుభవాలు ఎదురయ్యాయే తప్ప పెద్దలు మాత్రం మ్యారేజీకి ఒప్పుకోలేదు. దీంతో గణేశ్, రంజనలు మనస్తాపానికి గురయ్యారు. ప్రేమను వదులుకునే బదులు తమ ప్రాణాలు విడవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. 6 నెలల కింద జరిగిన ఈ ఘటన అప్పట్లో  గుజరాత్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రేమ జంట చనిపోవడాన్ని వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేకపోయామని మనో వేదనకు గురయ్యారు. చనిపోయిన ప్రేమ జంటకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. గణేశ్, రంజనల విగ్రహాలు తయారు చేయించి.. పెద్దలు, బాధితుల కుటుంబ సభ్యులంతా కలిసి గణేశ్‌‌‌‌‌‌‌‌, రంజన విగ్రహాలకు ఇలా  కిందటివారంలో పెండ్లి జరిపించారు.