కలికాలం వచ్చేసింది అంటే ఏంటో అనుకున్నాం.. అప్పుడప్పుడు జరిగే సంఘటనలు చూస్తే నోరెళ్లబెట్టటమే కాదు.. ఔరా ఏమిటీ విచిత్రం అని ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో జరిగిన ఘటనతో అందరూ నివ్వెరపోతున్నారు. ఈ సమాజం ఎటు పోతుంది అంటూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ యజమాని మైనర్ కొడుకుపై కన్నేసి శారీరకంగా వాడుకుని వదిలేసిన వివాహితను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. రాధ అనే వివాహిత.. సిద్దిపేట హనుమాన్ నగర్ లోని ఓ ఇంట్లో గత మూడేళ్ళుగా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో 16 ఏళ్ల ఇంటి యజమాని కొడుకుపై సదరు మహిళ కన్ను పడింది. దీంతో అతడిని తన మాయమాటలతో లోబర్చుకుని శారీరకంగా వాడుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలుడితో కలిసి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని వచ్చిన బాలుడితో.. 2024, జనవరి 22న భర్త, పిల్లలను వదిలేసి సదరు మహిళ చెన్నై వెళ్లిపోయింది. బాలుడు తెచ్చిన నగదు, నగలతో జల్సా చేసింది.
మరోవైపు తన కొడుకు కనిపించడం లేదని.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలో బాలుడితో వివాహిత ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకుంటరాన్న అనుమానంతో బాలుడిని సిద్దిపేటలోని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయింది వివాహిత. ఏం జరిగిందని పోలీసులు బాలుడిని ప్రశ్నించగా..
చెన్నైలో ఒక రూమ్ కిరాయికి తీసుకొని అక్కడే తనను ఉంచి.. సదరు మహిళ బలవంతంగా శారీరకంగా కలవమని ఇబ్బంది పెట్టిందని తెలిపాడు. బాలుడి వెంట తీసుకొని వెళ్ళిన డబ్బులు ఖర్చయిన తర్వాత.. బంగారు నగలను చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మగా వచ్చిన డబ్బులు కూడా జల్సాలకు ఖర్చు అయిపోయాయని చెప్పాడు. దీంతో పోక్సో కేసులో సదరు వివాహితను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ వెల్లడించారు.