ప్రియుడి కిడ్నాప్ కు వివాహిత యత్నం.. పెనుగులాటలో ప్రియుడి తండ్రి మృతి

ప్రియుడి కిడ్నాప్ కు వివాహిత యత్నం.. పెనుగులాటలో ప్రియుడి తండ్రి మృతి

విశాఖపట్టణం: వివాహితుడైన ప్రియుడిని కిడ్నాప్ చేయడానికి అతని ప్రియురాలైన వివాహిత ప్రయత్నించింది. అది గమనించిన ప్రియుడి తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వివాహిత వెంట వచ్చిన మరో నలుగురు యువకులు ప్రియుడిని కారులో బలవంతంగా తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ప్రియుడి తండ్రి స్పృహ తప్పి పడిపోయి తర్వాత చనిపోయాడు. విశాఖపట్టణంలోని తగరపు వలసలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.

విశాఖపట్టణం తగరపువలస బాలాజీ నగర్ కు చెందిన రౌతు వంశీకృష్ణ (24)వివాహితుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత మహిళ (35) రెండేళ్ల క్రితం భర్త, తన ఇద్దరు పిల్లలతో కలసి బాలాజీనగర్ లోనే కాపురం పెట్టింది. ఈమెకు వంశీకృష్ణతో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య విడదీయలేని బంధానికి దారితీసింది. దీంతో కొద్ది రోజుల క్రితం ఇరువురు కలసి ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. భీమిలి పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పెద్ద గొడవ జరిగింది. ఇది తెలుసుకున్న వంశీకృష్ణ ఇంటికి తిరిగొచ్చేశాడు. తన పరిస్థితి ఏమిటంటూ సదరు మహిళ నిలదీయడంతో.. వంశీకృష్ణను వదిలి వెళ్లేందుకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నారు. దీంతో ఆమె బాలాజీనగర్ లో ఉన్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయింది.

అయితే నిన్నమధ్యాహ్నం వంశీకృష్ణ తన తండ్రి నడిపే చికెన్ సెంటర్ కు నడుచుకుని వెళ్తుండగా కారులో నలుగురు యువకులను వెంట పెట్టుకుని వచ్చిన వివాహిత అండర్ పాస్ బ్రిడ్జి వద్ద కాపు కాసి అడ్డగించింది. దగ్గరలోనే ఉన్న వంశీకృష్ణ తండ్రి వెంకటరావు వివాహిత రావడం గమనించి.. మళ్లీ ఎందుకొచ్చారు.. మా వాడి జోలికి రావద్దని చెప్పానని అరుచుకుంటూ రావడం గమనించింది. తన వెంట రమ్మని వంశీకృష్ణను వివాహిత బలవంతం చేయగా..  తండ్రి దగ్గరకు రావడం గమనించి రానని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె తన అనుచరులు నలుగురుని పురమాయించి బలవంతంగా వంశీకృష్ణను కారులో ఎక్కించుకుని పోవాలని ప్రయత్నించింది. అనూహ్యంగా అడ్డుపడిన వంశీకృష్ణ తండ్రి  వెంకటరావు తన కుమారుడిని తీసుకుని వెళ్లకుండా అడ్డుకున్నాడు. పెనుగులాటలో  వెంకటరావు స్పృహ తప్పి పడిపోవడం గమనించిన వివాహిత కారులో పరారైంది. కొద్దిసేపటికే వెంకటరావు చనిపోయాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు మధురవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.