మార్టినాకు మళ్లీ క్యాన్సర్

మార్టినాకు మళ్లీ క్యాన్సర్

టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవాకు మళ్లీ క్యాన్సర్ సోకింది. ఆమె గొంతు, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు స్వయంగా వెల్లడించింది. క్యాన్సర్ నుంచి త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. గొంతు, రొమ్ము క్యాన్సర్లు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపింది. ఒకేసారి రెండు క్యాన్సర్ల బారిన పడటం తీవ్రమైందని..అయితే నయం అవుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చింది. వ్యాధులపై పోరాడతానని పేర్కొంది. 

2022 నవంబర్‌లో WTA  ఫైనల్స్‌ సందర్భంగా నవ్రతిలోవా తన మెడపై ఒక కణితిని గుర్తించారు. పరీక్షల నిర్వహించగా.. తొలి దశ గొంతు క్యాన్సర్‌గా తేల్చారు. ఆ తర్వాత మరిన్ని వైద్య పరీక్షలు చేయగా..రొమ్ములోనూ క్యాన్సర్‌ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 66 ఏళ్ల మార్టినా 2010లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ఆ తర్వాత ఆమె శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని కోలుకుంది. ప్రస్తుతం మరోసారి ఆమెకు క్యాన్సర్లు సోకాయి. అయితే స్టార్టింగ్ స్టేజ్ లోనే  ఉన్నాయని కాబట్టి బయపడాల్సిన అవసరం లేదని  మార్టినా ఆశాభావం వ్యక్తం చేసింది.  తనకు సోకిన కేన్సర్ హెచ్‌పీవీ రకమని చికిత్సకు స్పందిస్తుందని చెప్పింది. 

చెక్‌-అమెరికన్‌ అయిన నవ్రతిలోవా తన టెన్నిస్  కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లను గెలిచింది. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా అవతరించింది. మరోవైపు ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ కోసం ఓ టెన్నిస్ చానల్‌లో మార్టినా కామెంటరీ చెప్పాల్సి ఉంది. అయితే ప్రస్తుతం  ఆమెకు క్యాన్సర్లు నిర్ధారణ కావడంతో కామెంటరీకి దూరం అయ్యే అవకాశాలున్నాయి. అటు మార్టినాకు క్యాన్సర్లు సోకాయన్న వార్త తెలిసి  అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.