న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత కార్ల డిమాండ్ అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సీ భార్గవ. సోషల్ డిస్టెన్సింగ్ (సామాజిక దూరం) అనేది అందరికీ అలవాటుగా మారడం కార్ల పరిశ్రమకు వరంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. దేశీయ ఆటోమొబైల్ రంగం గత కొంత కాలంగా కష్టాలలోనే కొనసాగుతోంది. కరోనా వైరస్‌తో గత నెలలో కార్ల అమ్మకాలు ఏకంగా 52 శాతం పడిపోయాయి. ఇండియాలో అమ్ముడయ్యే ప్రతీ రెండు కార్లలో ఒకటి మారుతి సుజుకి తయారు చేసేదే కావడం విశేషం. సామాజిక దూరం అలవాటుగా మారితే ఒకరి పక్కన మరొకరు కూర్చోవడానికి ప్రజలు ఇష్టపడక పోవచ్చని, దాంతో కార్ల అమ్మకాలకు ఊపు వస్తుందని భావిస్తున్నట్లు భార్గవ చెబుతున్నారు.
కరోనా తర్వాత పాత ఇండియా ఉండదని, ప్రజల కొనుగోలు అలవాట్లూ మారతాయని అభిప్రాయపడ్డారు. అమ్మకాలు తగ్గడంతోపాటు, లాక్‌డౌన్‌తో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ సహా కార్ల తయారీ కంపెనీలు ప్రొడక్షన్ ఆపేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా దేశమంతటా లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత చైనాలోని డీలర్‌షిప్స్ రోజు వారీ అమ్మకాలు మళ్లీ పెరిగాయి. భార్గవ అంచనాలకు ఈ డేటా ఆధారంగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే సొంత వాహనాలుండటమే మేలని చైనాలోని ప్రజలు భావిస్తుండటంతో కార్ల అమ్మకాలకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ నిలిపేయడంతోపాటు, పెట్టుబడులకూ ఆటోమొబైల్ కంపెనీలు బ్రేక్ వేయడంతో డీలర్‌షిప్స్‌లోని 4 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఈ విషయంపై ప్రధానికి లెటర్ కూడా రాసింది. లాక్‌డౌన్ కాలంలో రోజుకి ఇండస్ట్రీ ప్రొడక్షన్ లాస్ దాదాపు రూ. 23 బిలియన్ దాకా ఉంటుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అంచనా వేస్తోంది.
