
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 350 సర్వీస్ టచ్ పాయింట్లను మొదలుపెడతామని, వీటిలో తెలంగాణ నుంచి 147 సెంటర్లు ఉంటాయని మారుతి సుజుకీ ప్రకటించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో కంపెనీకి 326 టచ్ పాయింట్లు ఉన్నాయి. మారుతీ సుజుకీ మంగళవారం హైదరాబాద్‌లోని రాంపల్లిలో నెక్సా సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా 4,500 సర్వీసింగ్ టచ్పాయింట్ల మైలురాయిని దాటింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సర్వీస్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ ఇండియాలో ఏ ఇతర కంపెనీకి ఇంత విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్ లేదని చెప్పారు. కరోనా కాలంలో కూడా లేబర్ చార్జీలను పెంచలేదని, ఇప్పుడు విడిభాగాల ధర కొద్దిగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం, దేశంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో విస్తరించి ఉన్న 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్‌షాప్‌లు వినియోగదారులకు వారి ఇంటి వద్దే సర్వీసింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
ఈ బండ్ల ద్వారా అన్ని మారుతి సుజుకి ప్యాసింజర్ వెహికల్స్‌కు సర్వీస్, రిపేర్లు, ఇతర సంబంధిత పనులు చేస్తారు. కార్ సర్వీసింగ్ అవసరాల కోసం కస్టమర్ పట్టణ ప్రాంతాల్లో 10-–15 కి.మీ కంటే ఎక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో 25 కి.మీ కంటే ఎక్కువగా ప్రయాణించకుండా చూస్తున్నామని వివరించారు. దేశంలోని సర్వీస్ సెంటర్లలో రోజుకు 60 వేల బండ్లకు సేవలు అందిస్తున్నామని బెనర్జీ చెప్పారు. గత ఏడాది 310 సర్వీస్ టచ్ పాయింట్లను యాక్టివేట్ చేశామని వివరించారు. కార్యక్రమంలో మారుతీ సుజుకి ఇండియా సీఈఓ హిసాషి టేకుచి కూడా పాల్గొన్నారు.