పిచ్చిపిచ్చిగా మారుతీ కార్లు కొంటున్న జనం : రోజుకు 18 వేలు.. డెలివరీ వెయిటింగ్ లో 2 లక్షల కార్లు

పిచ్చిపిచ్చిగా మారుతీ కార్లు కొంటున్న జనం : రోజుకు 18 వేలు.. డెలివరీ వెయిటింగ్ లో 2 లక్షల కార్లు

మోడీ సర్కార్ జీఎస్టీ రేట్ల తగ్గింపులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి తీసుకురావటంతో దేశవ్యాప్తంగా కొనుగోళ్ల కోలాహలం కొనసాగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ అలాగే ఆటో సేల్స్ దుమ్మురేపుతున్నాయి. కంపెనీలు కూడా కొన్ని త్రైమాసికాలుగా డల్ అయిన తమ వ్యాపారాలను రివైవ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం అందించిన జీఎస్టీ రిలీఫ్ పూర్తిగా కస్టమర్లకు పాసాన్ చేయటంతో చరిత్రలో ఎన్నడూ చూడని పండుగ అమ్మకాల రికార్డులను కంపెనీలు నమోదు చేస్తున్నాయి. 

దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ పండుగల వేళ రోజూ 18వేల కార్ల బుక్కింగ్స్ చూస్తోంది. గతంలో పండుగల సమయంలో ఇది రోజుకు 10వేల కార్లుగా ఉండేది. దాదాపు సేల్స్ డబుల్ కావటంతో మారుతీ చిన్న కార్ల అమ్మకాలు ఆకాశమే హద్దుగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో కొత్త కార్ల అమ్మకాలు 35-40 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. పైగా కంపెనీ అమ్మకాలను పెంచేందుకు వీలుగా చిన్న కార్లకు ఫైనాన్సింగ్ స్కీమ్స్ ప్రవేశపెట్టి నెలకు రూ.2వేల ఈఎంఐతోనే కార్లు కొనుక్కునేందుకు వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. 

నవరాత్రికి మోడీ సర్కార్ ఇచ్చిన జీఎస్టీ బూస్ట్ పుణ్యమా అని మారుతీ సుజుకీ భారీ అమ్మకాలను చూస్తోంది. దీంతో పండగ మెుదటి 8 రోజుల్లోనే లక్షా 65వేల కార్లను డెలివరీ చేసి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అమ్మకాలుగా కన్వర్ట్ చేసేస్తోంది. మెుత్తం మీద ఈసారి పండగ ముగింపుకు ఈ అమ్మకాలు 2 లక్షల యూనిట్లు క్రాస్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రతిని పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటి వరకు 3లక్షల 50వేల కార్ల బుక్కింగ్స్ వచ్చాయని వీటిలో 2లక్షల 50వేల కార్ల డెలివరీలు పెండింగ్ ఉన్నట్లు వెల్లడించారు. 

కంపెనీ ప్రస్తుతం దీపావళి, దసరా సేల్స్ సమయంలో చిన్న కార్లు, హ్యాచ్ బ్యాక్స్, సెడాన్స్, ఎస్ యూవీల, ఎంపీవీల్లో పెరిగిన అమ్మకాలను చూస్తోంది. కంపెనీ ప్రస్తుతం రవాణా విషయంలో అంతరాలు ఉన్నాయని వాటిని అక్టోబర్ 10 నాటికి సరిదిద్దేందుకు కృషి చేస్తున్నారమి చెబుతోంది. నవరాత్రి మెుదటి రోజున ఫ్యాక్టరీల నుంచి పంపిన కార్ల కంటైనర్లు ఇప్పటికీ రవాణాలోనే ఉన్నాయని.. అక్టోబర్ 10 నాటికి అవి డెలివరీల కోసం డీలర్ల వద్దకు చేరుకుంటాయని కంపెనీ చెబుతోంది. మెుత్తానికి 2025లో ఆటో కంపెనీలు గడచిన దశాబ్ధకాలంలో ఎన్నడూ చూడని భారీ అమ్మకాలతో దూసుకుపోతున్నాయి.