
స్వాతంత్య్రోద్యమ కాలంలో సైమన్ గో బ్యాక్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్రా గో బ్యాక్ అనే నినాదాలు ప్రజల ఆకాంక్షలను ప్రకటించాయి. ఇప్పుడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మార్వాడీ గో బ్యాక్ అనే నిరసన గళాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ ఇలాంటి బ్యానర్లు పట్టుకొని కొందరు రోడ్ల మీదికి వస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ నిరసన రోజురోజుకూ పెరుగుతోంది. టీవీ, యూట్యూబ్ చానళ్లలో ఈ అంశంపై డిబేట్లు కొనసాగుతున్నాయి. ఓ చానల్ ప్రసారం చేసిన చర్చలో మార్వాడీ ప్రతినిధి తెలంగాణవాళ్లను కించపరిచేవిధంగా మాట్లాడటం జరిగింది. అలా రెండు వర్గాల మధ్య ఓ ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.
దేశమంతా విస్తరించిన మార్వాడీలు
తెలంగాణలో మార్వాడీల ప్రవేశం ఈనాటిది కాదు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఈ వాణిజ్య సామాజిక వర్గం మొగలుల, ఆంగ్లేయుల పాలనా కాలంలోనే దేశమంతా విస్తరించింది. ప్రధానంగా దేశంలోని అన్ని నగరాల్లో హోల్‌సేల్ వ్యాపారాలు, కంపెనీల డీలర్ షిప్ లు వీరి చేతిలోనే ఉన్నాయి. ప్రతి వస్తువు టోకుగా వీరి దగ్గరే తీసుకొని స్థానిక వ్యాపారులు తమ చిన్న దుకాణాల్లో అమ్మే పరిస్థితి ఏర్పడింది. అలా ఎటుచూసినా, ఏ వ్యాపారమైనా వారి పెత్తనమే కొనసాగుతోంది.
నగరాలకే పరిమితమైన మార్వాడీ వ్యాపారాలు కొన్నేళ్లుగా పట్టణాలకు విస్తరించాయి. హైదరాబాద్ శివార్లలోని కొత్త ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టగానే, నగర విస్తరణలో భాగంగా గ్రామ పంచాయతీల్లో వెంచర్లు పడగానే, రోడ్లు కూడా సరిగ్గా ఏర్పడకముందే మార్వాడీ దుకాణాలు వెలుస్తున్నాయి. వీరిరాకతో ఎంతోకాలంగా స్థానికంగా ఆయా వ్యాపారాలు చేసుకుంటున్నవారు తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది.
స్థానిక వ్యాపారుల ఆందోళన
తెలంగాణ పట్టణాల్లో, ఊర్లలో చాలా కులాలు తమ వృత్తిపర వ్యాపారాల్లో కొనసాగుతూ బతుకుతున్నాయి. ఉదాహరణకు పద్మశాలీలు ప్రధానంగా బట్టలు వ్యాపారం చేస్తే, కోమట్లు కిరాణా కొట్లు నడుపుతారు. అదే మార్వాడీల విషయానికొస్తే అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు.
కిరాణా, క్లాత్, జ్యువెల్లరీ, బిల్డింగ్ మెటీరియల్, లేడీస్ ఎంపోరియం ఇలా అన్నిరకాల షాపులు వారివే. తరతరాలుగా ఒకే వ్యాపారాన్ని నమ్ముకొని నిశ్చింతగా బతుకుతున్న స్థానిక వ్యాపార కుటుంబాలకు వీరి రాక, విస్తరణ చావుదెబ్బలా మారిపోతోంది. ఈ పరిస్థితే అమనగల్లులో ఆందోళన రూపంలో బయటపడింది.
మార్వాడీ వ్యాపారులు గో బ్యాక్ అంటూ వారు ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. 'మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. వారి దుకాణాల్లో వారి ప్రాంతానికి చెందినవారే పనివారిగా ఉన్నందున స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదు. అందుకే మన ప్రాంతం, - మన వ్యాపారం కాపాడుకునేందుకు 18 ఆగస్టు నాడు బంద్‌లో పాల్గొనాలి' అని ఆమనగల్లు స్థానిక వ్యాపారుల సంఘాలు కలిసి కరపత్రం విడుదల చేశాయి. అయితే, చివరి నిమిషంలో వివిధ కారణాల వల్ల బంద్‌ను వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.
మార్వాడీలపై గతంలోనూ నిరసనలు
మార్వాడీలపై ఇలాంటి నిరసనలు కొత్త కాదు. 2021లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో 'మార్వాడీ హటావో, తూప్రాన్ బచావో' అనే ఆందోళన మొదలవగా స్థానిక అగర్వాల్ సంఘ నేతలు దీన్ని సామరస్యంగా పరిష్కరించారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగమని, సమాజానికి తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పి వారు స్థానికులను శాంతింపజేశారు.
పదేళ్ల క్రితం ఒడిశాలో ఓ సంఘటన మూలంగా మార్వాడీల ఆస్తుల ధ్వంసమే జరిగింది. వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు వెళ్లిన యువకులతో ఓ మార్వాడీ దుకాణదారు అవమానకరంగా మాట్లాడడంతో ఈ గొడవ మొదలైంది. దాంతో స్థానికులపై పట్టింపులేని మార్వాడీలు వెళ్లిపోవాలి అనే నినాదం మార్మోగింది. ఈ సెగ బిహార్, పశ్చిమ బెంగాల్‌కు కూడా పాకే ప్రమాదాన్ని రాజకీయ ప్రమేయంతో నిలువరించారు.
ఇలా చాలాచోట్ల బయటపడిన నిరసనలను మార్వాడీలు రాజీమార్గం ద్వారానే నిలువరించారు. వారు స్థానికులు కాకపోవడం, వారి జనసంఖ్య తక్కువగా ఉండడం వారి ఆస్తులకు హాని జరగకుండా కాపాడుకోవడంలాంటివి రాజీకి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి.
రాజ్యాంగపరంగా సాధ్యమయ్యే పనికాదు
ఈ మధ్య సికింద్రాబాద్ మోండా మార్కెట్లో వాహనాల పార్కింగ్ విషయంలో మొదలైన రగడలో మార్వాడివాళ్లు ఓ దళిత యువకుడిపై భౌతిక దాడికి దిగినట్లు ఓ వీడియోలో ఉంది. ఆ ఆగ్రహం మార్వాడీ గో బ్యాక్ అనే పిలుపుకు తోడయింది. స్థానిక హిందూ సంఘాల పెద్దలు, బీజేపీ నేతలు కొందరు ఈ మార్వాడీ వ్యతిరేకతను పాకిస్తాన్ సృష్టి అంటున్నారు.
అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు దీని వెనుక ఉన్నారని అంటున్నారు. రోహింగ్యాల ప్రస్తావన తెస్తున్నారు. ఈ మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టించడమే వారి ఉద్దేశం. ఈ మార్వాడీ వ్యతిరేకతకు బీజేపీ నేతలు ఎన్ని వివరణలు ఇచ్చినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయితే, దేశంలోని పౌరులను ఒక ప్రాంతం నుంచి గో బ్యాక్ అనడం కుదిరే పనేనా? మార్వాడీలను వెనక్కి వెళ్లాలి అనడంలో ఒక ఆక్రోశం ఉంది.
కానీ, రాజ్యాంగపరంగా సాధ్యమయ్యే పనికాదు. అయితే, స్థానిక ప్రజలు తమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు మార్వాడీ సమాజం ముందున్నాయి. తాము ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉంటాం అన్నప్పుడు తెలంగాణకు వారు చేసిన లేదా చేసే మేలు ఏమిటో స్పష్టపరచాలి. నిరసనకు కారణమైన మార్వాడీల చేతిలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది.
- బద్రి నర్సన్ –