వ్యాక్సిన్ వచ్చినా.. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి!!

వ్యాక్సిన్ వచ్చినా.. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి!!

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ వచ్చాక కూడా ప్రజలు మాస్కులు కట్టుకోవడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్‌ ప్రోటోకాల్స్ పాటించడం తప్పదని యూఎస్ వ్యాక్సిన్ డెవలపర్ చెప్పారు. వ్యాక్సిన్ కరోనా సోకిన వ్యక్తికి వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది కానీ ఆ వ్యక్తిని కలిసిన వారికి హాని జరగకుండా ఆపలేదని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రొపికల్ మెడిసిన్‌కు అసోసియేట్ డీన్‌గా ఉన్న మరియా ఎలెనా బొట్టాజ్జి తెలిపారు.

వ్యాక్సిన్ వచ్చాక పరిస్థితులు మళ్లీ సాధారణంగా మారతాయనేది అబద్ధమని బొట్టాజ్జి అన్నారు. ‘కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ మ్యాజిక్ సొల్యూషన్ మాత్రం కాదు. అవి ఎంత సక్సెస్‌ అయినా పూర్తి పరిష్కారమైతే కాదు. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే మాస్కు తీసేసి పక్కన పడేయడమనేది భ్రమే. ఇది జరగని పని. అన్నింటికీ అదే పరిష్కారమని ప్రజలు అనుకుంటే అది పొరపాటే’ అని బొట్టాజ్జి పేర్కొన్నారు. వ్యాక్సిన్ రోగాన్ని తగ్గిస్తుందేమో గానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేదన్నారు. ఈ వ్యాక్సిన్‌లు అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయని తాను భావించడం లేదన్నారు.